Thursday, 28 June 2012


క్రీడలు


సైనాకు ఇండోనేషియా ఓపెన్ టైటిల్

ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గెలుచుకుంది. జూన్ 17న జకార్తాలో జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన జురుయ్ లీపై విజయం సాధించి మూడోసారి ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. 2009, 2010లలో ఈ టైటిల్‌ను సాధించింది. 2011లో ఫైనల్‌లో పరాజయం పాలై రన్నరప్‌గా మిగిలింది. తాజా విజయంతో ఈ ఏడాదిలో సైనాకిది మూడో టైటిల్. గత మార్చిలో ఆమె స్విస్ ఓపెన్, ఇదే నెలలో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల విభాగంలో సియోన్ సాంతాసో విజేతగా నిలిచాడు.

యుఎస్ ఓపెన్ గోల్ఫ్ విజేత సింప్సన్
యుఎస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను అమెరికాకు చెందిన వెబ్ సింప్సన్ గెలుచుకున్నాడు. జూన్ 18న జరిగిన పోటీలో మైఖేల్ థామ్సన్‌పై విజయం సాధించాడు.

నేపాల్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని
నేపాల్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు. నేపాల్‌లో క్రికెట్ వ్యాప్తి కోసం అంబాసిడర్ హోదాలో ధోని కృషి చేస్తాడు.

అంతర్జాతీయం

అమెరికా అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంగా గుర్తింపు పొందిన అమెరికా అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారత్‌కు చెందిన శ్రీకాంత్ శ్రీనివాసన్‌ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబమా నియమించారు. ప్రస్తుతం శ్రీనివాసన్ అమెరికా డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఈయన చండీగఢ్‌లో జన్మించారు. తర్వాత శ్రీనివాసన్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. స్టాన్‌ఫర్డ్ లా స్కూల్ నుంచి న్యాయ శాస్త్రం అభ్యసించారు.

డేనియల్ హిల్లేల్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ హిల్లేల్‌కు 2012 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లభించింది. వ్యవసాయ రంగంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఉన్న ప్రాధాన్యతపై ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. గత ఐదు దశాబ్దాలుగా వ్యవ సాయంలో నీటి సమర్ధ వినియోగం, పంట దిగుబడి పెంచడం, పర్యావరణ క్షీణత తగ్గించడం వంటి అంశాలపై డేనియల్ విశేషంగా కృషి చేస్తున్నారు.

మిడిల్ ఈస్ట్, ఇతర ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తిలో విప్లవం తీసుకొచ్చారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ నోర్మన్ బోర్లాగ్ ఏర్పాటు చేశారు. ఆహార, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పౌష్టికాహారం, మార్కెటింగ్, పేదరిక నిర్మూలన, రాజకీయ నాయకత్వం, సామాజిక శాస్త్రాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డు బహూకరిస్తారు.

అఫ్ఘానిస్థాన్‌పై అంతర్జాతీయ సదస్సు
అఫ్ఘానిస్థాన్ సమస్య పరిష్కారంతోపాటు ప్రాంతీయ సహకారం పెంపొందించే దిశగా చేపట్టాల్సిన చర్యలను సూచించడం కోసం జూన్ 14న కాబూల్‌లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఇందులో భారత్, చైనా, రష్యా సహా 30 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 2014 లో నాటో దళాలు అఫ్ఘానిస్థాన్ నుంచి విరమించుకోనున్న నేపథ్యంలో ప్రాంతీయ తోడ్పాటు అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. తీవ్రవాదం, మాదకద్రవ్యాల రవాణాపై పోరాడేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. సదస్సులో భారత ప్రతినిధిగా కేంద్ర న్యాయ, మైనార్టీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పాల్గొన్నారు.

ఇరాన్ ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు
ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై విధించే ఆర్థిక ఆంక్షల విషయంలో భారత్‌సహా ఏడు దేశాలకు అమెరికా మినహాయింపునిచ్చింది. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను భారత్, మలేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టర్కీ, తైవాన్‌లు గణనీయంగా తగ్గించుకున్నాయని దాంతో ఆంక్షల నుంచి వీటికి మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

రోదసిలోకి చైనా మహిళ
చైనా జూన్ 16న తన తొలి మహిళా వ్యోమగామి లియు యాంగ్‌ను అంతరిక్షానికి పంపింది. దీంతో అమెరికా, రష్యాల తర్వాత రోదసీలో మానవ సహిత డాకింగ్ (అనుసంధానం) నిర్వహించిన మూడో దేశంగానూ చైనా రికార్డు సృష్టించనుంది. వాయవ్య చైనాలోని గోబి ఎడారిలో గల జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి షెంర-9 వ్యోమనౌక (దేవుడి వాహనం అని అర్థం) ద్వారా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపినట్లు చైనా ప్రకటించింది. లియు ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా పనిచేశారు. చైనా తొలి మహిళా ఆస్ట్రోనాట్ కావడంతోపాటు అంతరిక్షంలోకి వెళ్లిన 57వ మహిళగా లియు రికార్డు సృష్టించారు.

ఈమెతోపాటు పురుష వ్యోమగాములు జింగ్ హైపెంగ్, లియు వాంగ్‌లు షెంర-9లో అంతరిక్షానికి వెళ్లారు. రోదసీలో శాశ్వత స్థావరం దిశగా అమెరికా, రష్యాల తర్వాత సొంత అంతరిక్ష కేంద్రం (తియాంగాంగ్-1)ను ఏర్పాటు చేసుకుంటున్న మూడో దేశంగా చైనా అవతరించింది. ఈ ప్రయోగం కోసం ఉపయోగించిన రాకెట్ చైనా ఇంతవరకు రూపొందించిన రాకెట్లలోకెల్లా పొడవైనది, బరువైనది కావడం విశేషం. షెంర-9ను తియాంగాంగ్-1కు అనుసంధానం చేయడంతోపాటు ఈ ముగ్గురూ వ్యోమనౌక నుంచి బయటికి వచ్చి తియాంగాంగ్‌లోకి వెళతారు.

గ్రీస్ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ విజయం
గ్రీస్ పార్లమెంట్ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. 29.7 శాతం ఓట్లతో న్యూ డెమోక్రసీ 79 సీట్లను గెలుచుకుంది. 26.9 శాతం ఓట్లతో అతివాద వామపక్షం సిరిజా 71 స్థానాలను దక్కించుకని రెండో స్థానంలో నిలిచింది. గ్రీస్ ఎన్నికల విధానం ప్రకారం ఎక్కువసీట్లు సాధించిన పార్టీకి బోనస్‌గా 50 సీట్లు లభిస్తాయి. దీంతో న్యూ డెమోక్రసీకి మొత్తం 129 సీట్లు వచ్చాయి.

పార్లమెంట్‌లో బోనస్ సీట్లతో కలిపి 300 స్థానాలు ఉంటాయి. ఆర్థిక ఉద్దీపనల అనుకూల న్యూ డెమోక్రసీ విజయంతో యూరో జోన్ సంక్షోభంతో సతమతమవుతున్న యూరప్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఉద్దీపనలను, పొదుపు చర్యలను వ్యతిరేకించే సిరిజా ఎన్నికల్లో గెలిస్తే గ్రీస్‌ను యూరో కరెన్సీ జోన్ నుంచి బయటకు తెస్తుందని, దీంతో ఆ దేశానికి అప్పులిచ్చిన దేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశీలకులు అంచనా వేశారు. గత నెల 6నజరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో తిరిగి జూన్ 17న ఎన్నికలు నిర్వహించారు.

ఇల్లినాయిన్ వర్సిటీ వీసీగా మిత్రా దత్తా
అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇల్లినాయిస్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా భారతీయ అమెరికన్ మిత్రా దత్తా నియమితులయ్యారు. ఈమె గౌహతీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ(ఫిజిక్స్) చేశారు.

ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా ఫతౌ బెన్‌సౌరా
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) నూతన చీఫ్ ప్రాసిక్యూటర్‌గా గాంబియన్ న్యాయవాది ఫతౌ బెన్‌సౌరా జూన్ 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఐసీసీ ప్రాసిక్యూటర్ల టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళ, మొదటి ఆఫ్రికన్ బెన్‌సౌరా.

21 ఏళ్ల తర్వాత సూకీ నోబెల్ ప్రసంగం

మయన్మార్ ప్రజాసామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ తన నోబెల్ శాంతి బహుమతి ప్రసంగాన్ని 21 ఏళ్ల తర్వాత జూన్ 16న ఇచ్చారు. నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూకీ ప్రసంగిస్తూ.. ‘ఈ బహుమతి నన్ను ఒంటరితనం నుంచి బయటపడేసి, మానవ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఆనాటి జుంటా పాలనలోని బర్మాలో ప్రజాస్వామ్య, మానవ హక్కుల కోసం సాగిన పోరాటంపైకి ప్రపంచ దృష్టిని మళ్లించింది’ అని చెప్పారు. సూకీకి 1991లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. అప్పుడు ఆమె గృహనిర్బంధంలో ఉండడంతో..సూకీ తరఫున ఆమె భర్త మైఖేల్ అరిస్, కొడుకులు కిమ్, అలెగ్జాండర్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


జాతీయం
బినాయక్ సేన్, బులూ ఇమామ్‌లకు గాంధీ అవార్డు
భారత్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్ సేన్, బులూ ఇమామ్‌లకు లండన్‌లోని గాంధీ ఫౌండేషన్ అంతర్జాతీయ శాంతి పురస్కారాలను ప్రకటించింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో వీరికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. బెంగాల్‌కు చెందిన పిల్లల వైద్యుడైన సేన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యంగా ఛ త్తీస్‌గఢ్ రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యం కోసం విశేష కృషి చేశారు. జార్ఖండ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త బులూ ఇమామ్ పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అంతర్జాతీయ శాంతి అవార్డును గాంధీ ఫౌండేషన్ 1998 లో ఏర్పాటు చేసింది. గాంధీ సిద్ధాంతాలను ప్రభోదిస్తూ, అహింసా మార్గాన్ని అనుసరించే వ్యక్తులు, గ్రూపులకు ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.

ఐటీడీసీ చైర్మన్‌గా వాఘేలా
ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చైర్మన్‌గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా జూన్ 13న బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అశోకా గ్రూప్ హోటళ్లను ఐటీడీసీ నిర్వహిస్తోంది. ఐటీడీసీ చైర్మన్‌కు కేబినెట్ స్థాయి హోదా ఉంటుంది.

భారత వృద్ధి రేటు 6.9 శాతం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2012-13లో 6.9 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.

‘గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్’ పేరిట ప్రపంచ బ్యాంకు జూన్ 12న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం భారత్ 2013-14లో 7.2 శాతం, 2014-15లో 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుంది. సంస్కరణలు నిలిచిపోవడం, విద్యుత్ సమస్య, బలహీన ద్రవ్య విధానం వంటి కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి సన్నగిల్లిందని నివేదిక విశ్లేషించింది. 2011-12లో భారత జీడీపీ 6.5 శాతానికి క్షీణించింది.

బార్క్ డెరైక్టర్‌గా శేఖర్ బసు
బాబా అణు పరిశోధన కేంద్రం(బార్క్) డెరైక్టర్‌గా శేఖర్ బసు నియమితులయ్యారు. ప్రస్తుతం బసు న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఐబీఏ చైర్మన్‌గా అలోక్ మిశ్రా
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్‌గా బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ అలోక్ మిశ్రా ఎన్నికయ్యారు. కె.ఆర్. కామత్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్), జేపీ దువా(అలహాబాద్ బ్యాంక్), చందా కొచ్చర్(ఐసీఐసీఐ బ్యాంక్) డిప్యూటీ చైర్ పర్సన్‌లుగా ఎన్నికయ్యారు.


No comments:

Post a Comment