![]() |
దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు. దీనిలో పీఓగా చేరే అవకాశం ఉద్యోగార్థులకు వచ్చింది. చిత్తశుద్ధితో దీక్షగా సిద్ధమై పోటీలో ముందుకువెళ్తే గౌరవప్రదమైన ఈ ఉద్యోగాన్ని గెలుచుకోవచ్చు!
ప్రొబేషనరీ కాలపరిమితి రెండు సంవత్సరాలు. ఇది ముగియగానే, ప్రొబేషనరీ కాలంలో ఉద్యోగి చూపిన ప్రతిభ ఆధారంగా స్వల్పకాలంలోనే అత్యున్నత స్థాయిని అందుకునే వీలుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థి ముందుగా బ్యాంకు వెబ్‌సైటు ద్వారా తన వివరాలు అప్‌లోడ్ చెయ్యాలి. తర్వాత'submit'చెయ్యాలి. అప్పుడు అభ్యర్థి వివరాలతో కూడిన 'ఫీజు చెల్లింపు చలానా' జనరేట్ అవుతుంది. దీన్ని ప్రింటవుట్ తీసుకోవాలి.
* ఏదైనా SBIబ్యాంకులో ఈ చలానా ద్వారా ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
* ఒకసారి బ్యాంకులో ఫీజు చెల్లిస్తే దరఖాస్తు చేయడం పూర్తి అయినట్లే.
* అభ్యర్థి ఫీజు చెల్లించిన మూడు రోజుల తర్వాత అభ్యర్థి దరఖాస్తు రిజిస్ట్రేషన్ ధ్రువీకరిస్తూ అభ్యర్థి దరఖాస్తులో ఇచ్చిన మొబైల్ నంబరుకు SMSవస్తుంది. అలాగే దరఖాస్తులో పేర్కొన్న ఈ-మెయిల్ ఐడీకి మెయిల్ కూడా వస్తుంది.
* తర్వాత అభ్యర్థి తను అప్‌లోడ్ చేసిన వివరాలు, ఫీజు చెల్లింపు వివరాలతో కూడిన దరఖాస్తును 'రీ ప్రింట్' తీసుకుని తనవద్ద భద్రపరుచుకోవలసి ఉంటుంది.
* ఫీజు చెల్లింపు రశీదు కూడా భద్రపరచుకోవలసి ఉంటుంది.
* ఒకవేళ అభ్యర్థి ఇంటర్వ్యూకు ఎంపిక అయినట్లయితే ఈ దరఖాస్తు ప్రింటవుట్, ఫీజు చెల్లింపు రశీదు ఇంటర్వ్యూ సమయంలో చూపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ప్రింటవుట్‌ను బ్యాంకుకు పోస్టు ద్వారా గానీ, మరే విధంగా గానీ పంపవలసిన పనిలేదు. అభ్యర్థి తనవద్దే భద్రపరచుకోవలసి ఉంటుంది.
* అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండి ఇంటర్వ్యూకు ఎంపిక అయితే ప్రస్తుత ఎంప్లాయర్ నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికెటు' ఇంటర్వ్యూ సమయంలో దాఖలు చేయవలసి ఉంటుంది.
* అభ్యర్థి ఆబ్జెక్టివ్ పరీక్షలోని అన్ని విభాగాల్లో విడివిడిగా అర్హత పొందాల్సివుంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో అర్హత పొందిన (క్వాలిఫై) అభ్యర్థులకు చెందిన డిస్క్రిప్టివ్ పేపర్లు మాత్రమే మూల్యాంకన(Value) చేస్తారు.
* క్వాలిఫైయింగ్ మార్కులు క్యాటగిరీల వారీగా బ్యాంకు తదుపరి నిర్ణయిస్తుంది.
* డిస్క్రిప్టివ్ పేపరులో కూడా అభ్యర్థి క్వాలిఫై కావలసి ఉంటుంది.
* తుది ఎంపిక అభ్యర్థి రాతపరీక్ష (ఆబ్జెక్టివ్- డిస్క్రిప్టివ్) , గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది.
* తుదిఎంపిక మొత్తం 300 మార్కులను 100కు సమానమయ్యే విధంగా లెక్కిస్తారు. రాతపరీక్షకు కేటాయించిన 250 మార్కులను 75కు సమానమయ్యే విధంగా, గ్రూప్ డిస్కషన్ ఇంటర్య్వూకు కేటాయించిన 50 మార్కులను 25కు సమానమయ్యే విధంగా లెక్కిస్తారు.
సిద్ధమయ్యే పద్ధతి
* ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ఇంగ్లిషు విభాగం ప్రిపరేషన్ కోసం వ్యాకరణం (గ్రామర్)పై ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఈ విభాగంలో గ్రామర్, వొకాబులరీ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలుంటాయి. ప్రతి విభాగంలో విడివిడిగా కనీస మార్కులతో క్వాలిఫై కావలసి ఉంటుంది. గ్రామర్, కాంప్రహెన్షన్‌లకు బాగా తయారైతే కనీస మార్కులు సులువుగా సాధించవచ్చు. వొకాబులరీ పరిధి విస్తృతమైనది కాబట్టి సాధ్యమైనంతవరకు దీన్ని పెంచుకుంటూ గ్రామర్, కాంప్రహెన్షన్‌లపై ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉంటుంది.
* జనరల్ అవేర్‌నెస్ సెక్షన్‌లో మార్కెటింగ్, కంప్యూటర్ నాలెడ్జిలు కూడా ఉన్నాయి.
* బ్యాంకింగ్, ఆర్థిక అంశాల సమకాలీన అంశాలపై 30 మార్కులు, మార్కెటింగ్ 10 మార్కులు, కంప్యూటర్ 10 మార్కులు ఉండే అవకాశం ఉంది.
* జనరల్ అవేర్‌నెస్ కోసం ప్రతిరోజూ వార్తాపత్రికలతోపాటుగా 'బ్యాంకింగ్ సర్వీసెస్ క్రానికల్' వంటి బ్యాంకు పరీక్షల కోసమే రూపొందించిన మ్యాగజీన్ చదవాలి.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సమకాలీన మార్పులు, చేర్పులు, బ్యాంకుకు సంబంధించిన ప్రాథమిక అంశాల సమాచారం కూడా ముఖ్యం.
* మార్కెటింగ్‌లో ప్రస్తుతం వస్తున్న నూతన విధానాలు, టాగ్‌లైన్స్, పంచ్ లైన్లు తెలుసుకోవాలి.
* కంప్యూటర్ ప్రాథమిక అంశాలపై సిద్ధం కావాలి. బ్యాంకింగ్ నిర్వహణలో కంప్యూటర్ సాంకేతికత పాత్రపై ప్రశ్నలుండవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు పొందడానికి వీలున్న విభాగం ఇది.
* డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రటేషన్ విభాగం కోసం ప్రాథమిక అంశాలన్నింటిపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. అంటే అరిథ్‌మెటిక్, మేథమెటికల్ ప్రాథమికాంశాల (బేసిక్స్)పై పట్టు సాధించిన తర్వాత ఇచ్చిన డేటాను విశ్లేషణ చేయడం సులువవుతుంది. ప్రాథమిక అంశాలైన శాతాలు (Percentage)సరాసరి (Average)నిష్పత్తి(Ratios),Tables, Squares,క్యూబ్స్ అంశాలు అభ్యర్థికి తెలియాలి. ప్రత్యక్షంగా ప్రాథమిక అంశాలపై ప్రశ్నలు ఉండకపోయినా డేటాను విశ్లేషించి ఇంటర్‌ప్రట్ చేయడానికి ఇవి చాలా ముఖ్యం.
* గత సం||లలో వచ్చిన బ్యాంకు పరీక్షల ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్‌లుసాధన చేయాలి. దీనివల్ల పరీక్షలో వేగాన్ని పెంచుకొని కచ్చితమైన సమాధానాలు గుర్తించగలుగుతారు.
* హైలెవల్ రీజనింగ్ విషయానికి వస్తే పూర్తిగా లాజికల్ రీజనింగ్‌పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రీజనింగ్ విభాగం విషయంలో ముఖ్యంగా ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదవటం వల్ల సమాధానాన్ని సులువుగా గుర్తించవచ్చు.
* ఆంగ్లంలో అభ్యర్థి Written Communic ation Skillsను పరీక్షించేందుకు నిర్దేశించిన డిస్క్రిప్టివ్ పరీక్ష అంశాలు- కాంప్రహెన్షన్, Precis Writing, Letter Writing వ్యాసరచన.
* అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత పై నాలుగు అంశాలు ఉపయోగించి తన రోజువారీ ఉద్యోగ నిర్వహణ చేయవలసి ఉంటుంది. అందుకే డిస్క్రిప్టివ్ పేపరు తప్పనిసరిగా క్వాలిఫై కావాలనే నిబంధన.
* ఏదైనా ఒక ప్రామాణిక ఆంగ్ల గ్రామర్ పుస్తకం అభ్యాసం చెయ్యడం ద్వారా ఈ అంశాలకు తయారవ్వొచ్చు. ప్రతిరోజూ ఏదైనా సమకాలీన అంశం తీసుకొని కనీసం 2 వ్యాసాలు రాయడం సాధన చెయ్యాలి. అలాగే ప్రతిరోజూ ఒక ఇంగ్లిషు దినపత్రిక కేవలం జనరల్ అవేర్‌నెస్ దృష్ట్యా కాకుండా గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, వ్యాసరచన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి కూడా ప్రిపేర్ కావలసి ఉంటుంది.
ఎస్‌బీఐ పీవో- ఐబీపీఎస్ పీవో మధ్య బేధం
* ఐబీపీఎస్ పీవో పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్‌లతో అయిదు విభాగాలుంటాయి.
* ఎస్‌బీఐ పీవోలో రీజనింగ్, డాటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్ విభాగాలతో పాటు జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్స్, మార్కెటింగ్‌లతో కూడిన నాలుగో విభాగముంది.
* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి బదులుగా డాటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ విభాగముంది.
* డిస్క్రిప్టివ్ టెస్ట్‌ను కాంప్రెహెన్షన్, షార్ట్ ప్రెసి, లెటర్ రైటింగ్, వ్యాసాలతో కూడిన జనరల్ ఇంగ్లిష్‌పై నిర్వహిస్తారు. అభ్యర్థులు దీనిలో కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
* రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)తో పాటు బృంద చర్చ (గ్రూప్ డిస్కషన్) కూడా నిర్వహిస్తారు. అభ్యర్థులు వీటిలో కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలి.
డాటా అనాలిసిస్- ఇంటర్‌ప్రిటేషన్ ఎలా?
ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బదులుగా డాటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగం వుంది. బ్యాంకు పరీక్షలకు సంబంధించి దీన్ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో భాగంగానే చూడాలి. దీనిలో గ్రాఫ్స్, చార్ట్స్, టేబుల్స్ ద్వారా సమాచారం ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
ఐబీపీఎస్ పీవో పరీక్షలోని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లోని 50 ప్రశ్నల్లో వీటినుంచి 20-25 ప్రశ్నలుండగా ఎస్‌బీఐ పీవోలో 45 ప్రశ్నలు డాటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి, 5 ప్రశ్నలు పర్‌మ్యుటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబులిటీ నుంచి ఉంటాయి. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఎస్‌బీఐ పీవో పరీక్ష ద్వారా గమనించవచ్చు.
ఈ విభాగాల్లో ఆరిథ్‌మెటిక్ నుంచి నేరుగా ప్రశ్నలు ఉండకపోయినా డాటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు సాధించడానికి పర్సెంటేజెస్, ఆవరేజెస్, రేషియో-ప్రపోర్షన్, ఇంట్రెస్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ మొదలైన అంశాలు చాలా అవసరం. అందువల్ల వీటన్నింటినీ బాగా నేర్చుకుని సాధన చేయాలి. అదేవిధంగా కొన్ని ప్రశ్నలకు సాధించాల్సిన అవసరం లేకుండా గ్రాఫ్‌లను గమనిస్తూ జవాబులను గుర్తించవచ్చు. అయితే వీటికి సాధన చాలా అవసరం. ఒకటి కంటే ఎక్కువ గ్రాఫ్‌లను ఇచ్చినపుడు వాటి మధ్య సంబంధాన్ని గుర్తిస్తూ ప్రశ్నలు సాధించాలి.
ఇంగ్లిష్ భాష ప్రాముఖ్యం
రాత పరీక్షలోని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండింటిలోనూ ఇంగ్లిష్ లాంగ్వేజి ఉంది. అంటే రాత పరీక్షకు సంబంధించిన మొత్తం 250 మార్కులకుగాను 100 మార్కులు దీనికే ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు దీనిపై దృష్టి సారించాలి. గ్రామర్‌ను నేర్చుకుని పూర్వ పరీక్షల్లోని ప్రశ్నలు సాధన చేయాలి.
ఇంగ్లిష్ వార్తాపత్రికలను చదవడంతో పాటు, ఏదేని విషయాన్ని తీసుకుని దానిపై దాదాపు 200 పదాల వరకు ఇంగ్లిష్‌లో రాయడం సాధన చేయాలి. విస్తృతంగా ఇచ్చిన ఏదేని విషయాన్ని చదివి అర్థంచేసుకొని దాన్ని అవసరమైనమేరకు కుదించి రాయడం అభ్యాసం చేయాలి. ఇది ప్రెసి రైటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్ వార్తాపత్రికలు గాని, కథలు, నవలలు గాని ఇంగ్లిష్‌లోని ఏదైనా చదివి అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఈ పరీక్షలో ఉన్న రీజనింగ్ హెచ్చుస్థాయిలో ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ రీజనింగ్ టాపిక్స్‌తో పాటు స్టేట్‌మెంట్స్-అసంప్షన్స్, కంక్లూజన్స్, కోర్సెస్ ఆఫ్ ఆక్షన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, పజిల్ టెస్ట్, ఎలిజబులిటీ టెస్ట్ మొదలైన వాటిని బాగా అభ్యాసం చేయాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయాలి.
* మార్కెటింగ్, కంప్యూటర్స్‌కు సంబంధించిన గతంలో పీవో లేదా క్లర్క్ పరీక్షల్లోని ప్రశ్నపత్రాల్లో ఈ విభాగంలోని ప్రశ్నలను గమనిస్తే వాటి సరళి అర్థమవుతుంది. తద్వారా వాటికి అనుగుణంగా వీటికి సిద్ధం అవ్వొచ్చు.
* ఎకానమీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ రుణాలకు ప్రాముఖ్యమిస్తూ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను గత 5, 6 నెలల నుంచి చూసుకుంటూవుంటే జనరల్ అవేర్‌నెస్, మార్కెటింగ్ అండ్ కంప్యూటర్ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.
ఈ మధ్య జరిగిన ఏ బ్యాంకు పరీక్షలకూ లేని విధంగా ఎక్కువ సమయం (3 నెలలు) ఉందని గమనించాలి. ఈ పరీక్షకు ప్రేరణతో ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా చదివితే 'అత్యున్నత కలల ఉద్యోగం' మీ సొంతమవుతుంది!
రాతపరీక్ష తర్వాత...
బృంద చర్చ:
* అభ్యర్థి చొరవ, భావవ్యక్తీకరణ, అవగాహన సామర్థ్యం పరీక్షిస్తారు. గ్రూప్ డిస్కషన్‌కు విడిగా మార్కులు కేటాయించారు కాబట్టి ఈ మార్కులకు కూడా ప్రాధాన్యం.
* కేవలం బిగ్గరగా మాట్లాడటం, అసందర్భంగా మాట్లాడటం, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు పదే పదే అడ్డుపడటం లాంటివి చెయ్యకూడదు.
* జరుగుతున్న సంవాదం (Discussion)కొనసాగింపుగా అభ్యర్థి తన భావవ్యక్తీకరణ చెయ్యాల్సి ఉంటుంది. అంతేకాని పూర్తి వ్యతిరేక ధోరణిలో వితండవాదం చెయ్యడం కూడదు.
* ఉద్వేగానికి లోనుకాకుండా ప్రశాంతంగా మృదువైన భాషణతో కూడిన భావవ్యక్తీకరణకే ఎక్కువ మార్కులు ఉంటాయనే విషయం అభ్యర్థి మరువకూడదు.
మౌఖిక పరీక్ష:
* ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశ్యం అభ్యర్థి వ్యక్తిత్వ పరిశీలన. ఇంటర్వ్యూలో అభ్యర్థి తన వ్యక్తిగత సమాచారాలన్నీ ఎంత విశిష్టంగా విపులీకరించి చెప్పగలిగితే అంత ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకోగలుగుతాడు.
* అలాగే SBIకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అభ్యర్థి ప్రిపేర్ కావలసి ఉంటుంది. అభ్యర్థి హాబీలు, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, క్లిష్టమైన పరిస్థితుల నిర్వహణ సామర్థ్యం మొదలైన అంశాల పరిశీలనే ధ్యేయంగా ప్రశ్నలుంటాయి.
* అభ్యర్థి ఆశావహ దృక్పథం కలిగి, మందహాసంతో సమయానుగుణంగా, చురుకుగా సమాధానాలు చెప్పడం ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ఎంతో ఉపకరిస్తుంది.
వెబ్‌సైట్: www.sbi.co.in
![]() |




No comments:
Post a Comment