Saturday, 5 January 2013

BIT SAT - 2013

BIT SAT - 2013

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ పిలాని, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో B.E. (Hons), M.Sc (Hons), M.Sc (Tech), B.Pharm (Hons) లలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఇది
ప్రతిష్ఠాత్మకమైన పరీక్షే కానీ సీటు సాధించే మార్కులు పొందటానికి కష్టమయ్యే
పరీక్ష కాదు. పరీక్ష స్వరూపంపై పూర్తి అవగాహన పెంచుకుంటే బిట్‌శాట్‌ ద్వారా సాధారణ విద్యార్థి కూడా సీటు సాధించవచ్చు!





ఐఐటీలు అత్యంత ప్రాచుర్యం పొందినప్పటికీ IIT, NIT ల కంటే BITSలోనే పోటీ అధికమని చెప్పవచ్చు. 2012 ప్రవేశపరీక్షలను ఆధారంగా తీసుకొంటే ప్రతి సీటుకూ పోటీపడిన విద్యార్థుల సంఖ్య బిట్‌శాట్‌లోనే అత్యధికం. ప్రతి సీటుకీ 68 మంది విద్యార్థులు పోటీ పడ్డారు.
బిట్స్‌ పిలానీలో 800 సీట్లు, గోవాలో 600 సీట్లు హైదరాబాద్‌లో 600 సీట్లు... మొత్తము 2000 సీట్లున్నాయి. మరి పోటీ ఇంత ఎక్కువ ఎందుకని? దేశంలో పరిశ్రమలకు కావలసిన ఇంజినీర్లను తయారుచేసేవిధంగా ప్రోగ్రాములు రూపొందించుకోవటమే దీనికి కారణం. మిగిలిన ఏ విశ్వవిద్యాలయంలోనూ లేనివిధంగా ప్రాక్టీసు స్కూల్‌ PS-I , PS-IIలు విద్యార్థుల ప్రతిభా పాటవాలను వెలికితీయడంతో పాటు వారిని కార్పొరేట్‌, పరిశోధన, పరిశ్రమలకు పరిచయం చేసేలా ఉన్నాయి.
ఈ సంస్థల్లో ఇంజినీరింగ్‌/ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాములు చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ సంస్థకు National Assessment and Accreditation Council (NAAC) నుంచి అత్యున్నతస్థాయి అయిన Five star rating వచ్చింది.
దరఖాస్తు ఎలా?
ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకొనే విధానం పరిశీలిద్దాం.
బిట్‌శాట్‌ -2013 పరీక్ష రాయదల్చుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. బాలురు అయితే Rs.1850/-, బాలికలు Rs 1350/-కు డీడీ తీసుకొని దరఖాస్తు నింపడం ప్రారంభించాలి. ఒకవేళ డీడీ కాకుండా అన్‌లైన్‌లోనే చెల్లించదలిస్తే వంద రూపాయలు తగ్గించి కట్టవచ్చు.
ఆన్‌లైన్‌లో ఒకసారి దరఖాస్తు పూర్తిచేస్తే ఎడిట్‌ ఆప్షన్‌ లేదు కాబట్టి జాగ్రత్తగా నింపాలి. ఉదాహరణకు మన ఇంటర్మీడియట్‌ బోర్డుకోడ్‌ APBT, పరీక్షా కేంద్రాలు నింపేటప్పుడు తప్పులేకుండా సరిచూసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపి సబ్‌మిట్‌ చేసిన తర్వాత స్వల్పమైన తప్పులు (ఉదాహరణకు పేరు నింపడంలో లాంటివి) ఉంటే వెంటనే విద్యార్థి ఆ తప్పును తెలుపుతూ బిట్స్‌ పిలానికి లెటరు పంపాలి. పరీక్షా కేంద్రంలాంటివి మార్చాలంటే మాత్రం మళ్ళీ ఇంకొక దరఖాస్తు నింపాలి. ఇది పంపేటప్పుడు తొలి దరఖాస్తు రద్దు చేసుకొంటున్నట్లగా బిట్స్‌పిలానికి లేఖ పంపించాలి. రెండో దరఖాస్తుకు మళ్ళీ ఫీజు చెల్లించాలి. మొదట నింపేటప్పుడే జాగ్రత్త వహిస్తే ఇబ్బందులు తప్పుతాయి.
బిట్‌శాట్‌కు దరఖాస్తు చేయాలంటే ఇంటర్‌ 2012లో పూర్తయినవారూ, 2013లో సీనియర్‌ ఇంటర్‌ పరీక్ష రాసే విద్యార్థులు మాత్రమే అర్హులు. లేదా 2011, అంతకుముందు ఇంటర్‌ పూర్తిచేసినవారు అనర్హులు. ఇంటర్‌ మాధ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో 60 శాతం పైగా మార్కులు సాధించినవారే అర్హులు.
ప్రశ్నలు వేరు... క్లిష్టత సమానం
ఇది ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి కీ బోర్డు, మౌస్‌లతో కొద్దిగా అయినా సాధన చేస్తే పరీక్ష హాల్లో ఇబ్బంది ఉండదు. కంప్యూటర్‌ పరిజ్ఞానం పూర్తిగా ఉంటేనే పరీక్ష రాయగలుగుతామనుకుంటే పొరపాటు. ఉపయోగించే పరిజ్ఞానం ఉంటే చాలు. ఈ పరీక్ష 3 గంటల వ్యవధిలో జరుగుతుంది. పరీక్ష మే 14- జూన్‌ 1వ తేదీ లోపు కోరుకున్న రోజున రాయవచ్చు. ఈ పరీక్షను ఏ రోజున రాసేదీ మార్చి 1- మార్చి 20 వరకు రిజర్వ్‌ చేసుకోవచ్చు. పరీక్ష కేవలం ఇంగ్లిషు మీడియంలో జరుగుతుంది.
విద్యార్థి మొదటగా కంప్యూటర్‌ దగ్గర కూర్చుని పరీక్ష ప్రారంభం కాగానే బిట్స్‌పిలాని వారి డేటాబేస్‌ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. రాసే విద్యార్థులందరికీ ఒకే ప్రశ్నలు రావు.
ప్రశ్నలు వేర్వేరు అయినపుడు క్లిష్టత కూడా వేర్వేరుగా ఉంటుందని కొందరు విద్యార్థులు భావిస్తున్నారు. కానీ వాటిని స్పష్టంగా నిర్వచించి ఉన్నారు. ప్రశ్నలు వేర్వేరు కావచ్చుకాని ప్రశ్నపత్రంలోని క్లిష్టత ఏ విధంగానూ మారదు. గత మూడేళ్ళలో ఇంతవరకూ ఏ విద్యార్థి కూడా అటువంటి అభ్యంతరం వ్యక్తపరచలేదు.
పరీక్షను ఏ సబ్జెక్టుతో అయినా ప్రారంభించవచ్చు. అలాగే ఆ సబ్జెక్టులో ఏ ప్రశ్నతో అయినా పరీక్ష మొదలుపెట్టొచ్చు. పరీక్ష రాసేటప్పుడు లెక్కలు సాధించటానికి కావలసిన తెల్లకాగితాలు పరీక్ష హాల్లోనే ఇస్తారు.
ఈ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలున్నాయి. ప్రతి సరైన సమాధానానికీ +3 మార్కులు, ప్రతి తప్పు జవాబుకూ -1 మార్కులు. అంటే పరీక్ష 450 మార్కులకు. 2012లో 400పైగా మార్కులు సాధించిన విద్యార్ధులు చాలా తక్కువ. బాలికల విభాగంలో 385 మార్కులకు జాతీయస్థాయి మొదటి ర్యాంకు వచ్చింది.
ఎన్ని మార్కులు సాధించాలి?
300 మార్కులు పైన సాధిస్తే పిలానీలో ఇంజినీరింగ్‌, 290 మార్కులపైన సాధిస్తే గోవా, హైదరాబాద్‌లలో సీటు సాధించడానికి అవకాశం ఉంది. మాధ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో 125 ప్రశ్నలు అంటే 375 మార్కులకు 250 పైన సులభంగా సాధించవచ్చు. కాబట్టి సీటు సాధించటం, మంచి మార్కులు పొందటం అనేది ముఖ్యంగా ఇంగ్లిష్‌, లాజికల్‌ రీజనింగ్‌ల మీదే ఆధారపడుతుంది.
సిలబస్‌లో ఏ విభాగం నుంచి ఎన్ని మార్కులు ఉన్నాయనేది స్పష్టంగా ఉంది కాబట్టి ఏప్రిల్‌ 7వ తేదీ జేఈఈ మెయిన్‌ పరీక్ష పూర్తయిన తర్వాత ఇంగ్లిష్‌, రీజనింగ్‌ అభ్యాసం ప్రారంభిస్తే సరిపోతుంది. పరీక్ష మే 14 నుంచి ప్రారంభం కాబట్టి నెలరోజులు ఇంగ్లిష్‌ సాధనకు సరిపోతుంది. ఆప్షన్‌ మే 14, 15, 16 తేదీల్లో తీసుకుంటే జేఈఈ-అడ్వాన్స్‌ జూన్‌ 2న ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
పరీక్షాసమయంలో 150 ప్రశ్నలన్నింటికీ జవాబులు గుర్తిస్తే అదనంగా 12 ప్రశ్నలు వస్తాయి. మాధ్స్‌-4, ఫిజిక్స్‌-4, కెమిస్ట్రీ-4. అయితే 150 ప్రశ్నలూ తప్పుల్లేకుండా సంపూర్ణంగా చేయగలిగామనే నమ్మకం ఏర్పడినపుడే తీసుకోవాలి- రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి! అదనపు ప్రశ్నలకోసం మొదటి 150 ప్రశ్నల్లో తప్పులు చేయకూడదు.
ఇంగ్లిష్‌... లాజికల్‌ రీజనింగ్‌
1)మాధ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. XI , XII తరగతి పుస్తకాలకు మాత్రమే పరిమితం కావాలి. ముఖ్యంగా కెమిస్ట్రీ. ఈ పుస్తకాలను ఒకటికి రెండు సార్లు చదవాలి.
2) ఇంగ్లిష్‌, లాజికల్‌ రీజనింగ్‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సాధన చేయాలి.
3)కంప్యూటర్‌పై ప్రాక్టీసు కోసం- బిట్స్‌ వెబ్‌సైట్‌లోని నమూనా పరీక్షలను తప్పకుండా సాధన చేయాలి.
4) ప్రశ్నలు సాధారణంగానే ఉంటున్నాయి. అందువల్ల ప్రాథమిక ప్రశ్నలు అంటే లెవెల్‌-I, లెవెల్‌-II ల వరకు అభ్యాసం చేస్తే సరిపోతుంది.
5) రుణాత్మక మార్కులున్నందున జవాబు తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించవద్దు.
6) గణితంలో ప్రశ్నల సంఖ్య ఎక్కువ. మన సిలబస్‌కే ప్రాధాన్యం ఇచ్చి అభ్యాసం చేస్తే కచ్చితంగా 45 ప్రశ్నలకు తేలిగ్గా జవాబులు గుర్తించవచ్చు.
ప్రతిష్ఠాత్మకం... ప్రత్యేకతల మయం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సువిశాల క్యాంపస్‌లు, పారిశ్రామిక రంగంతో సంబంధాలు, 'బిట్స్‌'ని అగ్రస్థానంలో నిలుపుతున్నాయి. దీనిలో చేరాలంటే బిట్‌శాట్‌లో మంచి స్కోరు సాధించాల్సిందే. ఈ సంస్థ ప్రత్యేకతలూ, సమగ్రంగా సంసిద్ధమయ్యే విధానమూ వివరంగా తెలుసుకుందాం!
నేర్చుకునే విధానంలో సంపూర్ణ స్వేచ్ఛ బిట్స్‌ ప్రత్యేకత! విద్యార్థి తనకు అనుకూలమైన పద్ధతిలో టైమ్‌టేబుల్‌, సబ్జెక్టులకు సంబంధించిన తరగతులను ఎన్నుకోవటానికి ఇక్కడ వీలుంది.
మొదటి సంవత్సరం ఏ కోర్సులో చేరినా రెండో సంవత్సరం బ్రాంచి/ కోర్సు మార్చుకోవచ్చు. డ్యూయల్‌ డిగ్రీని అయినా ఎంచుకోవచ్చు. బీటెక్‌ చేస్తూ ఎంటెక్‌ లేదా ఎంటెక్‌ చేస్తూ పీహెచ్‌డీకి ప్రవేశాన్ని పొందవచ్చు. ఇతర సంస్థలతో పోలిస్తే ఈ అవకాశం విభిన్నంగా, ప్రోత్సాహకరంగాఉంటుంది.
నాలుగు సెమిస్టర్ల కోర్సు పూర్తయిన తర్వాత ప్రతి విద్యార్థినీ పరిశ్రమల పరిశీలనకు పంపుతారు. చదువుకున్న విషయాలకూ, వాస్తవ పరిస్థితులకూ సారూప్యాలూ, తేడాలూ గమనించటానికి ఇదో చక్కని అవకాశం.
ఏమేం కోర్సులు?
పిలానీ ప్రాంగణం: బిట్స్‌పిలానీ క్యాంపస్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీలలో బి.ఇ. (ఆనర్స్‌); బయలాజికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మాథమెటిక్స్‌లలో ఎమ్మెస్సీ (ఆనర్స్‌); జనరల్‌ స్టడీస్‌, ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లలో ఎమ్మెస్సీ (టెక్‌)లతో పాటు బి.ఫార్మసీ (ఆనర్స్‌) ఉన్నాయి.
హైదరాబాద్‌ ప్రాంగణం:
బిట్స్‌ హైదరాబాద్‌లో పైన పేర్కొన్న కోర్సులలో బయోటెక్నాలజీ కాకుండా మిగిలిన కోర్సులు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లలో బి.ఇ. (ఆనర్స్‌), ఎమ్మెస్సీ (ఆనర్స్‌) కూడా అన్ని కోర్సులు, బి.ఫార్మసీ (ఆనర్స్‌)తో పాటు ఎమ్మెస్సీ (టెక్‌) ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (మాత్రమే) ఉన్నాయి.
గోవా ప్రాంగణం:
బిట్స్‌ గోవా క్యాంపస్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లలో బి.ఇ. (ఆనర్స్‌); పిలానీలో మాదిరిగానే అన్ని ఎమ్మెస్సీ (ఆనర్స్‌) కోర్సులు; ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో ఎమ్మెస్సీ (టెక్‌) కోర్సులు ఉన్నాయి.
దుబాయ్‌ ప్రాంగణం:
బిట్స్‌ దుబాయ్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీలో బి.ఇ. (ఆనర్స్‌)తో పాటు ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో ఎమ్మెస్సీ (టెక్‌) కోర్సులు ఉన్నాయి.
దుబాయ్‌ క్యాంపస్‌లో ప్రవేశానికి బిట్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోరు అవసరం లేదు. అర్హత పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులను బట్టి ప్రవేశం లభ్యమవుతుంది.
డ్యూయల్‌ డిగ్రీ స్కీమ్‌
పైన పేర్కొన్నవన్నీ ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు. కాకపోతే ఎమ్మెస్సీ (ఆనర్స్‌)లో చేరిన విద్యార్థులకు రెండో డిగ్రీగా బి.ఇ. (ఆనర్స్‌), బి.ఫార్మసీలలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీన్నే డ్యూయల్‌ డిగ్రీ స్కీమ్‌ అంటారు. మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి విద్యార్థి ఎసైన్‌మెంట్స్‌ ప్రతిభని బట్టి పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో ఈ అవకాశం లభ్యమవుతుంది. డ్యూయల్‌ డిగ్రీని ఎంచుకున్న విద్యార్థికి ఐదేళ్ళు చదివి కోర్సును పూర్తిచేసిన తర్వాత ఎమ్మెస్సీ (ఆనర్స్‌)తో పాటు బి.ఇ./ బి.ఫార్మసీ (ఆనర్స్‌) డిగ్రీ కూడా ఇస్తారు.
బిట్స్‌ ప్రవేశ పరీక్షలో స్కోరు సాధించాక బిట్స్‌లో ప్రవేశానికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి దరఖాస్తు ఫారం, ఇతర వివరాలు బిట్స్‌ వెబ్‌సైట్‌లో 20 మే 2013 నుంచి అందుబాటులో ఉంచుతారు.
పరీక్ష సిలబస్‌: మాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో CBSE/ఇంటర్మీడియట్‌ సిలబస్‌లోనే ఇంచుమించు ప్రశ్నల్ని అడుగుతారు. ఇంగ్లిష్‌, రీజనింగ్‌లలో పోటీ పరీక్షలకు అడిగే స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. సిలబస్‌ పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ని చూడాలి. ప్రశ్నల స్థాయిని అంచనా వేసుకోవడానికి వీలుగా గత సంవత్సరాల ప్రశ్నపత్రాల్ని అధ్యయనం చేస్తే మంచిది.
వీలైనన్ని ప్రాక్టీసు టెస్టులు...
NCERT/CBSEపుస్తకాలను సిలబస్‌కు అనుగుణంగా అధ్యయనం చేయాలి.
పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
కంప్యూటర్‌పై అవగాహన కోసం వీలైనన్ని ప్రాక్టీస్‌ టెస్టులకు హాజరుకావాలి.
సాధన ద్వారానే సమయ నిర్వహణ, కచ్చితత్వం సాధ్యమవుతాయి. ఫలితంగా నెగటివ్‌ మార్కుల

తగ్గుతాయి.
ఇంగ్లిష్‌, రీజనింగ్‌లో ప్రశ్నలను కొంచెం నేర్పుగా చేయగలిగితే స్కోరు పెంచుకోవడం తేలిక.
అత్యుత్సాహంతో అదనపు ప్రశ్నల కోసం ప్రయత్నించడం మాని మొదటి 150 ప్రశ్నల్ని జాగ్రత్తగా ఆన్సర్‌

చేయాలి.
ముఖ్యమైన ఫార్ములాలను, కాన్సెప్టులను విడిగా పుస్తకంలో రాసుకుని వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి.
జనవరి, ఫిబ్రవరి, మార్చి- ఈ మూడు నెలలూ వీలయినన్ని టెస్టులు ఆన్‌లైన్‌లో సాధన చేయాలి.
ఎం.ఐ.టి. తరహాలో....
ఇండియాలోని డీమ్డ్‌ యూనివర్సిటీల్లో రెండోస్థానం
NAACరేటింగ్‌లో ఐఐటీలతో పోలిస్తే ఉత్తమ రేటింగ్‌
ప్రాక్టీస్‌ స్కూల్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులు విభిన్న ప్రముఖ పరిశ్రమల్లో పనిచేసి నైపుణ్యాన్ని పెంచుకోవటం
అంతర్జాతీయ ఖ్యాతి చెందిన MIT తరహాలో బోధన, సాంకేతిక సహకారం
దేశంలోని అన్ని రకాల ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ప్రత్యేకస్థానం. గత ఏడాది (2012) దాదాపు 2000 పైగా ఉన్న సీట్లకు లక్షా ముప్ఫైవేలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు 68 మంది పోటీ పడ్డారు.
ప్రభుత్వ సంస్థల్లో మాదిరిగా రిజర్వేషన్లు లేవు.
ప్రాక్టీస్‌ స్కూల్‌ వల్ల విద్యార్థికి పరిశ్రమలలో విభిన్న సంస్థల్లో శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.
బిట్స్‌కు ప్రముఖ పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలతో గల అనుబంధం వల్ల ప్రాంగణ ఎంపికల్లో ఆకర్షణీయమైన జీతభత్యాలు లభ్యమవుతాయి.
మనదేశంతో పాటు విదేశాల్లో కూడా ఇంటర్న్‌షిప్‌ చేసే వీలు విద్యార్థులకు అందుబాటుతో ఉంది. దీనితోబాటు విద్యార్థులు స్టయిపెండ్‌ కూడా పొందవచ్చు.
గతంలో బిట్స్‌లో చదివిన అనేకమంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారి స్ఫూర్తితో బిట్స్‌లో విద్యాబోధన, ప్రయోగశాలలు, శిక్షణ ఏటా మెరుగుపడుతున్నాయి.


No comments:

Post a Comment