Saturday, 5 January 2013

దిగజారుతున్నపైచదువులు


దిగజారుతున్నపైచదువులు
ప్రభుత్వం విద్యను ప్రైవేటు రంగానికి వదిలేసి, దానికి కేటాయించాల్సిన నిధులను ఇతర రంగాలకు మళ్ళిస్తోంది. ఉన్నత విద్యను ప్రాధాన్యం లేనిదిగా చూస్తూ జీడీపీలో దానికి కేటాయింపులు తెగ్గోసింది. విశ్వవిద్యాలయాలకు ఇచ్చే నిధులను తగ్గిస్తూ, యూనివర్శిటీలనే సంపాదించుకోమనడం విద్యారంగంపై, ముఖ్యంగా ఉన్నత విద్యపై ప్రభుత్వ అవగాహన లేమికి నిదర్శనం. చదువు 'కొన'లేని పేద, బలహీన వర్గాలు ఉన్నత విద్య ప్రైవేటీకరణ వల్ల నష్టపోతున్నాయి. ఇది ప్రణాళిక లక్ష్యాలకు, సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం.
సమగ్ర చట్టం, సమున్నత ఆశయాలు, లక్ష్యాలతో 1956లో విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ని ఏర్పాటు చేశారు. అంతకుముందూ తరవాతా ఎన్నో కమిషన్‌లు, కమిటీలు వేశారు. ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అయినప్పటికీ దేశంలో నేటికీ దాదాపు 40శాతం నిరక్షరాస్యులుగా మిగలడం విచారకరం. ఎంతోమంది పరిపాలకులు, అధికారులు విదేశాలకు వెళ్లి, అనేక విద్యా విషయాలు అధ్యయనం చేసి, శిక్షణలు పొంది వచ్చారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. అవేవీ అమలు కాలేదు. ఫలితంగా నిరక్షరాస్యత, పేదరికం రెండూ పెనవేసుకొంటూ నడుస్తున్నాయి. పెరుగుతున్న జనాభావల్ల ఉద్భవిస్తున్న సమస్యల పరిష్కారానికి దీటైన మానవవనరులు అవసరం. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, దేశ వార్షిక ప్రణాళికతోపాటు, ఇతర దేశాల ఆర్థికసహాయం తీసుకొంటున్నా, అవరోధాలు అధిగమించలేకపోతున్నాయి. ప్రాథమిక విద్యను పటిష్ఠపరచి, మధ్యలో బడి మానేసేవారిని (డ్రాపవుట్లను) నియంత్రిస్తే అక్షరాస్యులు పెరుగుతారు. మాధ్యమిక విద్యకు బలం చేకూరుతుంది. ఇది సంఖ్యాబలం మాత్రమే. దానికి శ్రద్ధ, బాధ్యతలను జోడిస్తే ఉన్నత విద్యలోనూ ఉత్తమ ప్రమాణాలు సాధించవచ్చు. కానీ, విలువలు లేని విద్యవల్ల దేశానికి, సమాజానికి నష్టం తప్ప, లాభం ఏమాత్రం లేదు.
అంతా ప్రైవేటుమయం
దేశంలో 17నుంచి 24 సంవత్సరాల లోపు యువతలో కేవలం తొమ్మిదిశాతమే కళాశాలల్లో చేరుతున్నారు. ప్రపంచ సగటులో ఇది సగమైనా కాదు. అమెరికా, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌ లాంటి దేశాల్లో విశ్వవిద్యాలయాల సంఖ్య జనాభాతో పోలిస్తే చాలా ఎక్కువ. మనదేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. 121కోట్ల జనాభాకు డీమ్డ్‌ యూనివర్సిటీలతో కలిపి 670 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ఉన్నత విద్య అభివృద్ధి చెందాలంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పెంచాలని, వాటిలో ప్రస్తుతం తొమ్మిదిశాతంగా ఉన్న విద్యార్థుల నమోదు రేటును 15శాతానికి చేర్చాలని నేషనల్‌ నాలెడ్జి కమిషన్‌ ప్రభుత్వానికి ఏనాడో సిఫార్సు చేసింది. అది అమలైన దాఖలా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పదహారు సంప్రదాయ (ట్రెడిషనల్‌) విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 2,101 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ సహాయంతో నడుస్తున్నవి 430 మాత్రమే. మిగతా 1,671 కాలేజీలు ప్రైవేటువి. దీంతో ప్రభుత్వం వీటిని సొంతంగా నడపలేక ప్రైవేటుపరం చేసింది. బడుగు, బలహీనవర్గాలకు ప్రైవేటు విద్య భారమై, దూరమవుతోంది. ఇంజినీరింగు కళాశాలలు దాదాపు 700, అందులో 673 కాలేజీలు ప్రైవేటు విద్యాసంస్థలే. ఇంజినీరింగ్‌ విద్యార్థుల సంఖ్య 3.5 లక్షలుగా అంచనా. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎంబీఏ కాలేజీలు 38 మాత్రమే. ప్రైవేటు సంస్థలు నడుపుతున్న కాలేజీలు 853. రాష్ట్రం మొత్తంమీద ఎంబీఏ విద్యార్థులు 77,940. ఎంసీఏ కాలేజీలు 713. వాటిలో 672 ప్రైవేటుగా నడుస్తున్నాయి. వాటిలో విద్యార్థులు 50,193. దీన్నిబట్టి ఉన్నత విద్య ప్రైవేటు విద్యా సంస్థలపైనే అధికంగా ఆధారపడి ఉన్నట్టు రూఢీ అవుతోంది.
మనదేశ బడ్జెట్లో 0.66శాతమే ఉన్నత విద్యపై ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఉన్నత విద్యపై వివిధ దేశాలు ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నదీ గమనిస్తే- భారతదేశంలో అది సుమారు 400 డాలర్లు. ఇంగ్లాండ్‌ 8,502 డాలర్లు, జపాన్‌ 4,830 డాలర్లు, చైనా 2,728, రష్యా 1,024, బ్రెజిల్‌ 3,986 డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అమెరికా, ఇంగ్లాండ్‌ తదితర దేశాల్లో విద్యా సంస్థలకు కొన్నేళ్ళకు సరిపోయే దాతృత్వ (ఎండోమెంట్‌) నిధులు ఉంటాయి. పౌర సమాజాన్ని విద్యాసంస్థలతో మమేకం చేయడం ద్వారా ఆ విధులను ఏ ఆటంకం, కొరత లేకుండా నిర్వహించవచ్చు. ఇదే పద్ధతిని భారతదేశం పౌర సమాజంతో మమేకం చేస్తే వనరుల కొరతను కొంత అధిగమించవచ్చు. విద్యను వ్యాపారాత్మకంగా కాకుండా, మానవ వనరుల అభివృద్ధి సూచికగా చూడాలంటూ యశ్‌పాల్‌ కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు పరచాలి. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో ఆరుశాతం విద్యారంగానికి వ్యయంచేస్తానన్న కేంద్రప్రభుత్వం- అందులో సగమే ఖర్చు చేయగలుగుతోంది. ఉన్నత విద్యకు మాత్రం అరశాతమైనా ఖర్చు చేయలేకపోతోంది. ఉన్నత విద్యకోసం ఏటా లక్షన్నర మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లడంవల్ల దేశం వేలకోట్ల రూపాయలు నష్టపోతోందన్న సాకుతో విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులిచ్చే ఆలోచన సరికాదు. అందుకు బదులు స్థానికంగానే పరిస్థితులను మెరుగుపరచుకునే ప్రయత్నం చేయాలన్నదే మేధావులు, ఉపాధ్యాయులు, ప్రజల ఆకాంక్ష. ఐఐటీలు, ఐఐఎంలలో ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళుతున్నవారిలో సగంమందైనా తిరిగి భారతదేశం రావడం లేదని, వారిపై పెట్టిన ఖర్చు ప్రభుత్వానికి నష్టం అనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. దీనిపై కొన్ని ఆంక్షలు విధించి స్వదేశంలో ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు కొంత సేవ చేసేలా మార్గదర్శకాలు రూపొందించడమే సమంజసం. అయినా, ప్రపంచీకరణ తరవాత మేధో వలసలను నియంత్రించడం న్యాయసమ్మతం కాదనే భావన మేధావుల్లో ప్రబలంగా ఉంది. ఉన్నత విద్యను మార్కెట్‌ శక్తులకు బదిలీ చేయకుండా, తగినన్ని నిధులు, పటిష్ఠమైన మానవవనరుల అభివృద్ధి, పర్యవేక్షణ, క్రమశిక్షణతో ఆ విద్యా సంస్థలను ప్రభుత్వం నడపాలి. లేకపోతే ప్రపంచీకరణ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం కష్టమే. ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగాలతో పాటు ఉన్నత విద్యలోనూ ప్రమాణాలు పతనమవుతున్నాయని ఎన్నో అధ్యయనాలు, కమిషన్లు, కమిటీలు ఎండగట్టాయి. అయినా ప్రభుత్వాలు మాటలు, ప్రకటనలకు పరిమితమవుతున్నాయే కాని, పరిస్థితిని చక్కదిద్దే చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసినా, వాటిలో అధ్యాపకుల కోసం చాలా మటుకు విదేశాలవైపు చూడాల్సి రావడం దురదృష్టకరం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో భారతదేశం స్థానం ఎక్కడా కనిపించని వైనం బాధాకరం.
పాశ్చాత్య దేశాల ఆదర్శం
ఇతర దేశాల్లో బోధన, పరిశోధన విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిశ్రమలతో, ఇతర కంపెనీలతో విశ్వవిద్యాలయాలను అనుసంధానిస్తున్నారు. మనదేశంలో ఈ దిశలో కొంత ప్రయత్నం జరుగుతున్నా అది సరిపోదు. సమకాలీన సమస్యలకు, సమాజ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల్ని తీర్చిదిద్దాలంటే, అమెరికా, తదితర దేశాల్లో అనుసరిస్తున్న మేలైన విధి విధానాలను పరిశీలించి, వాటి అనుభవాలు, విజయాల నుంచి దేశీయంగా మన వైఫల్యాలనుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందడుగు వేయాలి. పరిపాలకులు ఇష్టానుసారం విధానాలు మారుస్తుండటంతో విద్యార్థుల్లో సందిగ్ధత ఏర్పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు, పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినదంటూ విద్యావ్యవస్థలో వికేంద్రీకరణ సూత్రాన్ని ప్రవేశపెట్టారు. కొంతకాలం తరవాత తిరిగి కేంద్రీకరణ పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి చర్యలవల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం ఏర్పడి, ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది.దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం, మానవతా విలువలతో కూడిన శాస్త్ర ప్రగతే అని డాక్టర్‌ స్వామినాథన్‌ అన్నారు. భారీ పెట్టుబడులతో యువతరంలో శక్తి సామర్థ్యాల పెంపుదలకు, మానవ వనరుల అభివృద్ధికి ప్రభుత్వాలు సంసిద్ధమైనప్పుడే వారు దేశానికి తరగని సంపద కాగలుగుతారు. లేకపోతే సామాజికంగా, ఆర్థికంగా వారే గుదిబండలవుతారని ప్రధానమంత్రే సహేతుకంగా స్పందించారు. విద్యారంగం అన్ని రంగాలకు ఆధారమైన రంగం. మారుతున్న పరిస్థితులు, సమాజావసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యారంగంతో అన్ని రంగాలను సంధానపరచాలి. స్థిర విధానం అనుసరించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి

No comments:

Post a Comment