సామాజిక, ప్రాంతీయ సమానత్వానికి ప్రణాళికా అభివృద్ధి
పేదరికానికి మూలం అసమానతలు. అమర్త్యసేన్ పేర్కొన్నట్లు ఒక రకమైన అసమానత మరో అసమానతకు దారితీస్తుంది. అధిక, సమ్మిళిత వృద్ధి సాధనే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికల్లో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని విజయాలు సాధించినా చారిత్రకంగా నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రజలు తగినంత లబ్ధి పొందుతున్నారా అనేదే ప్రశ్న. నేటికీ కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందువల్ల పన్నెండో ప్రణాళికలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. ప్రణాళికా దార్శనిక పత్రంలోనే ఈ అంశాన్ని పేర్కొన్నారు.
సామాజిక సమానత్వం
చారిత్రకంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు అభివృద్ధి ఫలితాలను అందించడానికి ప్రత్యేక కృషి అవసరం. ఇది గుర్తించి ప్రణాళికలు మొదటి నుంచే దీన్ని ఓ లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారికి రాజ్యాంగరీత్యానే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, నిర్వాసితులు, హెచ్ఐవీ బాధితులు లాంటి వర్గాల ప్రజలను ప్రత్యేక దృష్టితో చూడాలనేది ప్రణాళికా విధానం. విద్య, ఉపాధి మొదలైన రంగాల్లో రిజర్వేషన్ల లాంటి కొన్ని చర్యల ద్వారా సామాజిక అసమానతల నిర్మూలనకు ప్రణాళికా కాలంలో కృషి జరిగింది. ఫలితంగా ఆయా వర్గాల్లో బడిలో చేరేవారి సంఖ్య పెరిగింది. పేదరికం, నిరక్షరాస్యత లాంటివి తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పటికీ ఈ వర్గాల్లో ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారికి, ఇతరులకు మధ్య అనేక రంగాల్లో సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయి. అందువల్ల షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో బడిలో చేరే వారి సంఖ్యను పెంచడం, బడిమానేస్తున్నవారి సంఖ్యను తగ్గించడంపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముంది. దీంట్లో భాగంగానే సామాజిక సమానత్వ సాధనపై పన్నెండో ప్రణాళికలో ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు.
సబ్‌ప్లాన్ల అమల్లో లోపాలు
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వర్గాల ప్రజలకు మధ్యనున్న అసమానతలను తగ్గించడానికి జరిగిన కృషిలో చెప్పుకోదగింది ఎస్సీలకు ఉద్దేశించిన 'స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్' (దీన్నే ఎస్సీ సబ్‌ప్లాన్ అని పిలుస్తారు). గిరిజనులకు సంబంధించిన సబ్‌ప్లాన్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటికి చట్టబద్ధత కల్పించే ఆలోచన చేస్తోంది. మొత్తం జనాభాలో ఈ వర్గాల ప్రజల నిష్పత్తికి అనుగుణంగా, వారి అభివృద్ధికి నేరుగా ప్రణాళికా నిధులు అందించడమే ఈ రెండు ప్లాన్ల ముఖ్య లక్ష్యాలు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఉద్దేశించిన ఈ రెండింటి అమల్లో కేంద్ర, రాష్ట్రాల స్థాయుల్లో లోపాలున్నాయని పన్నెండో ప్రణాళికా దార్శనిక పత్రంలో పేర్కొన్నారు. అందువల్ల గతంలో వీటి అమల్లో ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని సబ్‌ప్లాన్ల అమలుకు పన్నెండో ప్రణాళికలో పకడ్బందీ వ్యూహాన్ని రచించాలి.
మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం
అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా ప్రత్యేక పథకాలు రచించడం, నిధులు కేటాయించడం వారి అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంలో ఒక అంశం మాత్రమే. ఈ వర్గాల ప్రజానీకానికి మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో పూర్తి భాగస్వామ్యం కల్పించడం కూడా సమ్మిళిత అభివృద్ధి వ్యూహ రచనలో ముఖ్యాంశం కావాలి. ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీని కోసం ప్రైవేట్ రంగంలోనూ నాణ్యమైన ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను ఈ వర్గాల ప్రజలకు అందించాలి. పర్యటకం, రిటైల్ వ్యాపార యాజమాన్యం లాంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ వాణిజ్య నైపుణ్యాలను ఈ ప్రజానీకానికి అందించాలి. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్ర తగ్గుతున్న నేపథ్యంలో ఈ వ్యూహానికి మరింత ప్రాధాన్యముంది. భారతదేశంలో మైనారిటీలు అధికంగా ఉన్న 90 జిల్లాల్లో బహుళ రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం పదకొండో ప్రణాళికా కాలంలో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది.
| ![]() |
మైనారిటీల సమూల అభివృద్ధి సాధన కోసం పన్నెండో ప్రణాళికలో ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాల్సిన అవసరముంది. ఈ పథకం అమలు తీరును సమీక్షించి మార్పులు చేయాలి. మానవ వ్యర్థ పదార్థాలను తరలించే వృత్తిలో ఉన్న వారికి సుస్థిరమైన పునరావాసం కల్పించాలన్నది పదకొండో ప్రణాళికా లక్ష్యం. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అందువల్ల ఈ అంశానికీ పన్నెండో ప్రణాళికా కాలంలో ప్రాధాన్యమివ్వాలి.
1995 నాటి నుంచి వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కులకు రక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం) చట్టం అమల్లో ఉంది. ఇప్పటికీ వికలాంగుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయనడానికి అనేక తార్కాణాలున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వికలాంగుల సమస్యలను పరిష్కరించడానికి పన్నెండో ప్రణాళికా కాలంలో ప్రత్యేక చర్యలు అవసరమని ప్రణాళిక దార్శనిక పత్రంలో పేర్కొన్నారు.
1995 నాటి నుంచి వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కులకు రక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం) చట్టం అమల్లో ఉంది. ఇప్పటికీ వికలాంగుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయనడానికి అనేక తార్కాణాలున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వికలాంగుల సమస్యలను పరిష్కరించడానికి పన్నెండో ప్రణాళికా కాలంలో ప్రత్యేక చర్యలు అవసరమని ప్రణాళిక దార్శనిక పత్రంలో పేర్కొన్నారు.
వృద్ధుల కోసం నూతన జాతీయ విధానం
సగటు జీవిత కాలంలో పెరుగుదల మూలంగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో యువశక్తి పెరుగుదలతోపాటు సగటు జీవిత కాలం అధికమవడం వల్ల వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ, భద్రతతోపాటు అనేక రకాల సేవల అవసరాలు పెరుగుతున్నాయి.వీటన్నింటినీ అందించాలని వృద్ధులకు సంబంధించిన నూతన జాతీయ విధానంలో పొందుపరుస్తున్నారు. వృద్ధులు మిగతా సమాజంలో పూర్తిస్థాయి భాగస్వాములుగా జీవనాన్ని సాగించే విధంగా ఏర్పాట్లు కావాలి. నగరీకరణ, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం లాంటి అనేక సామాజిక, ఆర్థిక కారణాల వల్ల గతంలో కుటుంబం, జన సమూహం ద్వారా లభించిన సేవలు ప్రస్తుతం వృద్ధులకు లభించడం లేదు.
| ![]() |
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ పరిస్థితి పట్ల గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. వృద్ధులకు వివిధ సేవలను అందుబాటులో ఉంచడానికి నవీన నమూనాలను ఆవిష్కరించాల్సి ఉంది.
మారుమూల ప్రాంతాల అభివృద్ధి
అభివృద్ధికి వివిధ రకాల కనెక్టివిటీలు కీలకమని ప్రణాళికలు గుర్తిస్తున్నాయి. వీటిలో లోపమే అభివృద్ధిలో వెనుకబాటుతనానికి ముఖ్యకారణం. భారతదేశంలో అనేక ప్రాంతాలు ఇప్పటికీ మారుమూల ప్రాంతాలుగా ఉండి, అభివృద్ధి ప్రక్రియలో చురుకైన పాత్రను పోషించలేకపోతున్నాయి. హిమాలయ, ఈశాన్య ప్రాంతాలు, పర్వత శ్రేణులు, దీవులు, మధ్య, తూర్పు భారతదేశంలోని మారుమూల ప్రాంతాలు వీటికి ఉదాహరణ. ఈ అభివృద్ధిలో లోపాల వల్లే కొన్ని ప్రాంతాల్లో విచ్ఛిన్నకర ఉద్యమాలు కూడా చెలరేగుతున్నాయి. అటవీ, గిరిజన ప్రాంతాలు కూడా ఇదే రకం పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మొత్తం మీద అభివృద్ధితో పోలిస్తే అటవీ, గిరిజన ప్రాంతాలు అదే స్థాయిలో అభివృద్ధిని సాధించలేకపోయాయి.
![]() |
వామపక్ష తీవ్రవాదం ప్రబలుతున్నవాటిలో అధికశాతం ఈ ప్రాంతాలే. ఇవి అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కావడం కూడా మరో విశేషం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం బుందేల్ ఖండ్. మరికొన్ని సందర్భాల్లో చారిత్రకంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న ప్రాంతాలుగా కూడా ఇవే ఉన్నాయి. మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశాలోని కల్హండి, బోలాన్ గిరి, కోరాపుట్, మధ్య తూర్పు భారతదేశంలోని గిరిజన ప్రాంతాలు, చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందువల్ల భారతదేశంలో సమగ్ర అభివృద్ధి కోసం చేసే ఏ వ్యూహంలోనైనా, ప్రాంతీయ అభివృద్ధి దృక్పథం కీలకమైంది. మారుమూల, వెనుకబడిన, నైసర్గికంగా సంక్లిష్ట ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. వీటి అభివృద్ధికి అంతర్ రాష్ట్ర సహకారం అవసరం. రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాల మధ్య ఈ మారుమూల, ఇతర ప్రాంతాలకు మధ్య ఉండే రవాణా, కమ్యూనికేషన్ కనెక్టివిటీని పెంపొందించాలి. పాలనా వ్యవస్థల సామర్థ్యం గణనీయంగా పెరగాలి. పాలనా వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధిలోనూ, పాలనా ప్రక్రియల్లోనూ స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఈ ప్రాంతాల ప్రజల్లో నిర్లక్ష్యానికి గురయ్యామనే భావనను తొలగించాలి. ముఖ్యంగా దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి భావన వేర్పాటు వాదానికి కారణమవుతోంది. ఇలాంటి ప్రత్యేక ప్రాంతాల, అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి వ్యూహాలను రూపొందించడం పన్నెండో ప్రణాళికా కాలంలో ప్రధాన లక్ష్యం కావాలి. మారుమూల ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించి, అక్కడి ప్రజలకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి అవకాశాలను చూపినప్పుడు వారి జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి. వీరికి ఆర్థికాభివృద్ధి ఫలితాలు సమర్థంగా అందుతాయి.
ఇప్పటికే ప్రణాళికావృద్ధిని సాధించడంతోపాటు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ (Backward Regions Grant Fund - BRGF), సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం (Border Area Development Programme - BADP), కొండ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం (Hill Area Development Programme - HADP), కల్హండి బోలాన్ గిరి, కోరాపూట్ ప్రణాళిక, బీహర్ ప్రత్యేక ప్రణాళిక, బుందేల్ ఖండ్ ప్రత్యేక ప్యాకేజి, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో తాజాగా ప్రారంభించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (Integrated Action Plan)లను వీటికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇలాంటివన్నీ పదకొండో ప్రణాళికా కాలంలో మొదలయ్యాయి. పన్నెండో ప్రణాళికా కాలంలో వీటి మధ్య మరింత సమన్వయం సాధించాలి. పన్నెండో ప్రణాళికా కాలంలో దృష్టి కేంద్రీకరించాల్సిన వివిధ అంశాలను దార్శనిక పత్రంలో పేర్కొన్నారు. నిర్లక్ష్యానికి గురైన వర్షాధార ప్రాంతాలు, వ్యవసాయాభివృద్ధికి ఆ ప్రాంతాలు అందించే తోడ్పాటుపై దృష్టి పెట్టాలి. ఇప్పటివరకు ఈ అవకాశాలను పెద్దగా ఉపయోగించుకోలేదు. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యమున్న మధ్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల అవసరాలను సమర్థంగా గుర్తించి, ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి. హిమాలయాలు, సరిహద్దు, మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు, నిరుపేదలు, ముఖ్యంగా ఆదాయం- వినిమయం చాలా తక్కువగా ఉన్న ప్రజలు; సమాజానికి దూరంగా బతుకుతున్న జాతులు, మహిళలు, పిల్లలు మొదలైన వర్గాల ప్రజలకు ప్రత్యేక అవసరాలుంటాయి. ఇదేవిధంగా సామాజికంగా, సాంస్కృతికంగా వివక్షకు గురువుతున్న ప్రజల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
నిర్దిష్ట అవసరాలున్న ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాల్సి ఉండగా, ఇక్కడే అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాలనా సామర్థ్యంలో తీవ్ర లోపాలున్నాయి. పాలనా వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. స్థానిక ప్రజల సాధికారికత లేదు. అందువల్ల స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. వీటిలో మానవ వనరులు, అమలు వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచాలి. ప్రధాన పథకాల అమల్లో నాణ్యత మెరుగుపరచాలి. గిరిజన ప్రాంతాలకు పంచాయతీరాజ్‌ను విస్తరించే పీసా చట్టాన్ని మెరుగ్గా అమలు చేయాలి. వివిధ పథకాల అమలుకు ఫలితాలనిచ్చేలా కేటాయింపులు చేయాలి. ప్రణాళికా సంఘం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఈ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలి.
ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి
ఈశాన్య ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక సవాళ్లున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి నవీన వ్యూహాలను రచించి, అమలు చేయాలి. ఇక్కడ గణనీయమైన అవకాశాలున్నా అభివృద్ధి చాలా మందకొడిగా జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులను పెంపొందించాలి. కనెక్టివిటీని; దేశంలోని ఇతర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచాలి. ప్రైవేట్ పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. వీటిని పెంచడానికి కూడా తగిన విధానాలను అమలు చేయాలి.



No comments:
Post a Comment