Saturday, 5 January 2013

ఎ'వరి'కీ పట్టదా?


ఎ'వరి'కీ పట్టదా?
* చైనాతో పోలిస్తే మనమెక్కడ!
చైనాలో వరి విప్లవం గురించి కొన్ని రోజులుగా వివిధ వేదికలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఇతర దేశాలనుంచి బియ్యం దిగుమతి చేసుకున్న ఆ దేశం, వరి ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచానికి పెద్దన్నగా అవతరించింది. ఇందుకు ప్రధాన కారణం చైనా తన సంప్రదాయ వరి సాగును వదిలిపెట్టి సంకర వరి (హైబ్రిడ్) బాట పట్టడమే. దీంతో ఆ దేశ ఆకలి తీరింది. ఇతర దేశాల ఆకలీ తీర్చుతోంది. హైబ్రిడ్ వరి పితామహుడు యువాన్ లాంగ్‌పింగ్, ఇతర శాస్త్రవేత్తలు ఇప్పుడు చైనాలో హెక్టారుకు 150 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చే వరి రకాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన హైబ్రిడ్ వరి అంతర్జాతీయ సదస్సులో వారు ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. భారత్‌తో పాటు ఎన్నో ఇతర దేశాలను అది ఆకట్టుకుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు హైబ్రిడ్ వరి వంగడాలపై పెద్దయెత్తున చర్చలు జరుపుతున్నారు. హైబ్రిడ్ వంగడాలు ఇప్పుడు ఒక్క చైనాకే పరిమితం కాలేదు. వియత్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, ఇటలీ, అమెరికా లాంటి దేశాలన్నీ వరి దిగుబడులు పెంచుకోవడానికి హైబ్రిడ్ దిశగా పరుగులు తీస్తున్నాయి. భారత్ సైతం అదే బాటలో పయనిస్తోంది.ఇప్పటికే ఈశాన్య భారతంలో 20లక్షల హెక్టార్లలో ఈ సాగు జరుగుతోంది. దీన్ని మరో 50లక్షల హెక్టార్లకు విస్తరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
ప్రశంసలతోనే సరి
మన దేశంలో వరి విస్తీర్ణం చైనాకంటే ఎక్కువ. మనం 4.5కోట్లహెక్టార్లలో వరి సాగు చేసి 15 కోట్ల టన్నుల దిగుబడి సాధించలేక చతికిల పడుతుంటే, చైనా కేవలం మూడు కోట్ల హెక్టార్లలోనే 20 కోట్ల టన్నుల దిగుబడి సాధిస్తోంది. హైబ్రిడ్ల్ అందుకు దోహదపడుతున్నాయి. మనది సస్యశ్యామల భారతం, మన భూముల్లో బంగారం పండుతుందని నానుడి. అలాంటప్పుడు మన రైతు చైనా రైతుతో ఎందుకు పోటీ పడలేక పోతున్నాడు? అక్కడ రైతులు వరిని మించి లాభదాయకమైన సాగు లేదని సంతోషిస్తుంటే, మన రైతు వరిని నమ్ముకుని ఉరితాడుకు వేలాడే గడ్డు పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి?
చైనా శాస్త్రవేత్త లాంగ్‌పింగ్ ఇటీవల హెక్టారుకు 13.5టన్నుల దిగుబడి ఇచ్చే వంగడాలు సృష్టించి రికార్డు సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. నిజానికి లాంగ్‌పింగ్‌కన్నా ఎక్కువ స్థాయిలో దిగుబడి సాధించారు భారతీయ రైతులు. బీహార్ రాష్ట్రం నలంద జిల్లా దర్బేస్‌పుర పంచాయతీ రైతులంతా శ్రీవరి సాగు చేసి హెక్టారుకు 22.4 టన్నుల దిగుబడి పొందారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ స్వయంగా పార్లమెంటులో కూడా ప్రకటించారు. ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. ఈ రైతుల విజయాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. అదే పంచాయతీలో రైతులు బంగాళదుంపల దిగుబడిలోనూ రికార్డు సృష్టించారు. మన రాష్ట్రంలో నాగరత్నం నాయుడు శ్రీవరి సాగులో ఆశ్చర్యకరమైన రీతిలో ఎకరాకు 15 టన్నుల దిగుబడి సాధించారు. వ్యవసాయ అధికారులు, పాలకులు వీరి వ్యక్తిగత విజయాలపై ప్రశంసల జల్లు కురిపించేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అంతే తప్ప ఆ రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారో తెలుసుకుని, మిగిలిన రైతులకు ఆ పరిజ్ఞానాన్ని, పద్ధతులను చేరవేసే ప్రయత్నాలు చేయడంలేదు.
చైనా తరహాలో మన వద్ద హైబ్రిడ్ సాగు వీలవుతుందా, లేదా అనే దానిపై శాస్త్రవేత్తల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చైనా వాతావరణం వేరు, అక్కడి ఆహార అలవాట్లు వేరు, ఆ బియ్యం నాణ్యత వేరన్నది ఒక వర్గం వాదన. మనదేశంలో ఆకలి సమస్యకు హైబ్రిడ్ వంగడాలే పరిష్కారమని వరి శాస్త్రవేత్తల్లో ఒక వర్గం అంటోంది. హైబ్రిడ్ సాగు వల్ల ప్రధాన లాభం నీరు తక్కువగా వినియోగించే వీలుండటం. పైగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. సంప్రదాయ వరి పంట ద్వారా ప్రస్తుతం రైతు హెక్టారుకు సాధిస్తున్న దిగుబడి కన్నా మరో రెండు టన్నుల ఎక్కువ దిగుబడి సాధించుకునే వీలు హైబ్రిడ్ వరితో సాధ్యమవుతుంది. హైబ్రిడ్ సాగు విషయంలో ప్రధాన భయం విత్తనాల తయారే. రైతులకు కావాల్సిన విత్తనాలను ప్రభుత్వం తయారు చేసి అందించే పరిస్థితి లేదు. ప్రైవేటు విత్తన కంపెనీల భాగస్వామ్యం తప్పనిసరి. మనదేశంలో విత్తన కంపెనీలపై ప్రభుత్వాల అజమాయిషీ అంతంతమాత్రమే. చట్టాలున్నా అవి కేవలం కాగితాలకే పరిమితమైపోయాయి. కిలో వరి విత్తనాల ధర రూ.250కిపైనే ఉంటుంది. హెక్టారుకు మామూలు విత్తనాలు 30 కేజీలు కావాలి. హైబ్రిడ్ అయితే కేవలం 15 కిలోలతోనే సరిపెట్టుకోవచ్చు. ఇది రైతుకు లాభదాయకమే. కానీ ప్రైవేటు విత్తన సంస్థల పాలబడితే రైతు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనే భయాలు తరుముతున్నాయి. చైనా, వియత్నాం, ఇటలీ, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో విత్తన కంపెనీలపై ఆ ప్రభుత్వాలుకఠిన నియంత్రణలు అమలుచేస్తున్నాయి. నాణ్యతలో లోపాలుండి రైతు నష్టపోతే ఆ నష్టాన్ని కంపెనీల నుంచే రాబడతారు. మన వద్ద ఆ పరిస్థితి లేదు.
చైనా లాంటి దేశాల్లో ఏ పంటకు ఎంత నీరు పెట్టాలి, ఎంత ఎరువు వేయాలి, ఏ విత్తనం వాడాలి అనేది ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ప్రైవేటు కంపెనీలు రైతులను మోసగిస్తే ప్రభుత్వాలు దండిస్తాయి. మనవద్ద ఇంత భారీ నీటిపారుదల వ్యవస్థ ఉన్నా రైతు తన పంటకు ఎంత నీరు కావాలో అంత ఉంచుకొని మిగిలిన నీటిని బయటకు పంపే వ్యవస్థ లేదు. వరి చేల నిండా నీరు ఉంచాల్సిన అవసరం లేదు. దీనివల్ల రైతుకే నష్టం. నీళ్లలో పిలకలు ఎక్కువగా పెరగక, పంట దిగుబడి తగ్గుతుంది. ఆరుతడిగా పొలం ఉంటే తడికి పిలకలు ఎక్కువ మొలచి దిగుబడి పెరుగుతుంది. కానీ తన మళ్లో నీరు ఒక సారి నిల్వ ఉంచుకున్న తరవాత దాన్ని బయటకు పంపే ఏర్పాటే ఉండదు. అసలు నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలీని దైన్యం. మెట్ట ప్రాంతాల్లోని రైతు పరిస్థితి మరీ దారుణం బావుల్లో నీరున్నా కరెంటు రాదు. వచ్చినప్పుడు రైతులు వరి మళ్లను నీటి మడుగులుగా మార్చేస్తున్నారు. దీనివల్ల నీటి దుర్వినియోగం, పంట నష్టం జరుగుతోంది. ఇది వ్యవసాయ అధికారులకు తెలుసు. ప్రభుత్వాలకూ తెలుసు. అయినా దీనిపై దిద్దుబాటు చర్యలు లేవు. తక్కువ నీరు, ఎరువుతో ఎక్కువ దిగుబడులు సాధించే శ్రీవరిని మన పాలకులు, అధికారులు చేజేతులా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ వరి ద్వారా అత్యధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నా పట్టించుకునే తీరిక, రైతుల్లో అవగాహన కల్పించే ఓపికా ప్రభుత్వాలకు లేకుండా పోతోంది. ఈ ఒక్క సాగు వల్ల రాష్ట్రంలో 30శాతం నీటి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. రాష్ట్రంలో మొత్తం వరి విస్తీర్ణంలో 60శాతం ఈ సాగు కిందకు తీసుకు రావచ్చు. కానీ ఆ దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు.
రైతుశ్రేయం పట్టని పాలకగణం
మనది సంప్రదాయ సాగు అని సూక్తులు వల్లిస్తున్న నేతలు, పరిశోధకులు పాత వంగడాలతోనే రైతులు సాగు చేస్తున్నారన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోరు. మన రాష్ట్రంలో 15ఏళ్లుగా కొత్త వరి వంగడం జాడలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడి వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం- మనరాష్ట్రంలోని పొలాలన్నీ ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నవే. అన్నింటికీ డీఏపీ వేయాల్సిన అవసరం లేదు. అయినా రైతు ఎరువు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. రోజుల తరబడి ఎండనక, వాననక ఎరువుల దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నాడు. ఏ పొలానికి ఎంత ఎరువు అవసరంమో, ఫాస్ఫరస్ లోటు ఎక్కడుందో అక్కడ ఏమేరకు ఎరువు వాడాలో, రైతుకు చెప్పే నాథుడు లేడు. పల్లెలో ఉండాల్సిన వ్యవసాయ క్షేత్రాధికారి ఏం చేస్తుంటాడో ఎవరికీ తెలీదు. భూసార పరీక్షలు తరచూ జరిపి రైతుకు తగిన జాగ్రత్తలు చెప్పేవారు కరవు. కనీసం రెండేళ్లకోసారైనా భూసార పరీక్ష చేసి ఎంతమేర ఫాస్ఫరస్ వేయాలనేది నిర్థరించుకుని ఆ సమాచారాన్ని రైతుకు ఇస్తే వారికి ఎంతో ఖర్చు తగ్గుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూలీల సమస్యతో రైతులు యంత్రాలను ఉపయోగిస్తున్నాడు. వాస్తవానికి ఇవి భారీ యంత్రాలు. మన రైతులు సాగు చేసేది చిన్న కమతాల్లో. ఈ భారీ యంత్రాలు కొలెలను ఎత్తుగా ఉంచేసి నరికేస్తుంటాయి. దీన్ని మళ్ళీ మడిలోకే దుక్కి చేస్తే భూమి కూడా సారవంతంగా మారుతుంది. అది చేయాలంటే మళ్ళీ కూలీల సమస్య. దాంతో రైతులు దానికి నిప్పుపెడుతున్నారు. దీనివల్ల భూమి వేడెక్కి రైతుకు ఎంతగానో ఉపయోగపడే మిత్ర పురుగులు, బ్యాక్టీరియాలు నశించిపోయి, భూమి నిస్సారమవుతోంది. దీనిపైనా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించే నాథుడు లేరు. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల మధ్య సమన్వయం కూడా అంతంతమాత్రమే. క్షేత్రస్థాయిలో రైతు దుస్థితిని గుర్తించి దిగుబడులు పెంచే దిశగా కలిసికట్టుగా అడుగు వేస్తేనే ప్రయోజనం. హైబ్రిడా, సంప్రదాయ వరా అనేది రైతుకు అనవసరం. సంక్షోభంనుంచి తాను గట్టెక్కడానికి ఉపయోగపడే ఏ వరి వంగడమైనా రైతుకు వరప్రసాదమే.

No comments:

Post a Comment