విద్యారంగ సంస్కరణలు- ఒక సమీక్ష
మన విద్యా వ్యవస్థ రాశి ఘనం- వాసి పూజ్యం అన్న చందంగా తయారైంది. కేంద్ర మంత్రి శశి థరూర్ మాటలే ఇందుకు నిదర్శనం.. కాలం చెల్లిన మన విద్యా విధానం దేశ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దలేకపోతోంది. దేశంలో 621 విశ్వవిద్యాలయాలు, 33,500 కళాశాలలతో ఉన్నత విద్యా వ్యవస్థ మేడిపండును తలపిస్తోంది. ప్రపంచంలోని 200 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒక్క భారతీయ వర్సిటీ కూడా లేకపోవడం మన విద్యా వ్యవస్థ దురవస్థను తేటతెల్లం చేస్తోంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వం విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందే తప్ప ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ఏమాత్రం బాధ్యత వహించడంలేదు. విశ్వవిద్యాలయాల ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రసంగాలతో ఊదరగొట్టారే తప్ప ప్రణాళికాబద్ద కార్యాచరణకు పూనుకోలేదు. భవిష్యత్తు అవసరాలకు ధీటుగా ఉన్నత విద్యారంగ పరిపుష్టీకరణ జరగాలని 1949లో విశ్వవిద్యాలయ సంఘ అధ్యక్షులుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సూచన ఇప్పటికీ అలానే మిగిలిపోయింది. విద్యారంగంలో నాణ్యత నానాటికీ కొడిగట్టిపోతోంది. ప్రైవేటు ఇంజనీరింగ్, వైద్య, మేనేజ్‌మెంట్ కళాశాలలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి. వీటిలో బోధిస్తున్న వారి విద్యా అర్హతలు, చేరుతున్న విద్యార్థుల సంఖ్యను మదింపు చేస్తే చేదు వాస్తవాలెన్నో వెల్లడవుతాయి.
కొంత ప్రయత్నం:
విద్యారంగంలో అన్ని స్థాయిల్లోనూ పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలనీ, అధిక ఫీజులు, ఇతర అక్రమాలను రూపుమాపాలని గతంలో మానవ వనరుల మంత్రిగా ఉన్న కపిల్ సిబాల్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. శామ్ పిట్రోడా నేతృత్వంలోని జాతీయ నాలెడ్జ్ కమిషన్ సిఫార్సులు, యశ్‌పాల్ కమిటీ నివేదికల ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు సిబాల్ వేగంగానే చర్యలు చేపట్టారు. చట్ట పరంగా, నిర్వహణా పరంగా మార్పులు సాధించాలని కేంద్రం అడుగులు వేసింది. అందులో భాగంగానే 2010 ఏప్రిల్ 1న విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) చేసింది. దేశంలోని 6-14 ఏళ్ల మధ్య పిల్లలందరికీ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చేసింది. దీంతో ప్రపంచంలో చట్టబద్ధంగా ఉచితంగా, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. వాస్తవానికి ఈ బిల్లును 2002 డిసెంబర్‌లోనే రూపొందించారు. ఇది చట్టంగా మారడానికి ఆరున్నరేళ్ల కాలం పట్టింది. అన్ ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో బలహీన వర్గాల పిల్లలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించడం కూడా ఇందులోని కీలకాంశం. ఈ లక్ష్యాలను సాధించగలమా అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ తొలిచివేస్తోంది.
పెరగని కేటాయింపులు:
నాణ్యమైన విద్యను అందించేందుకు ఆరుశాతం నిధులు కేటాయించాలని కొఠారీ కమిషన్ మొదలు విద్యా రంగంపై నివేదికలిచ్చిన పలు కమిషన్‌లు సిఫార్సు చేశాయి. ప్రభుత్వాలు మాత్రం ఏనాడూ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం జీడీపీలో 3.4 శాతానికి అటూ ఇటూగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. లక్ష్య సాధనలో ఈ నిధుల లేమే ప్రధాన అడ్డంకి. విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి నిధులు కేటాయింపు పెంచాలని, 2011-12లో రూ.35,659 కోట్లు కేటాయించాలని అనిల్ బోర్డియా కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పటికి కేటాయించింది రూ.21వేల కోట్లు మాత్రమే. రాష్ట్రాలు భరించాల్సిన నిష్పత్తి సొమ్మును వెచ్చించకపోవడంతో ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 2012-13 బడ్జెట్‌లో రూ.25,555కోట్లు కేటాయించారు. అంతేకాకుండా పిల్లలందరికీ ఉచిత విద్య అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రిగా ఉన్న కాలంలో కపిల్ సిబాల్ చేతులెత్తేశారు. కార్పొరేట్ సంస్థలు, ప్రైవేటు రంగం ముందుకు రావాలని కోరారు. అంటే ప్రాథమిక విద్యను ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లో పెట్టడమే. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమి, ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా మనం ఎన్ని చట్టాలు చేసినా ఫలితంలో పెద్ద మార్పు ఉండడం లేదు. బాల కార్మిక వ్యవస్థ యథాతథంగా కొనసాగుతోంది. డ్రాపవుట్లు అలానే ఉన్నాయి. ప్రాథమిక విద్యనే సక్రమంగా అందించలేని ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో మార్పులు సాధించడం సాధ్యమేనా అనే ప్రశ్న మేధావులు, విద్యావేత్తలనే కాదు, సామాన్యుల్ని సైతం ఆలోచింపజేస్తోంది.
మార్పులకు సుముఖం:
విద్యా రంగ సంస్కరణల్లో భాగంగా ఉచిత విద్యపై నియంత్రణ, అంచనాల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది యూజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ కంటే ఉన్నత స్థాయిలో ఉంటుంది. మైనారిటీ విద్యా సంస్థల చట్టాన్ని సవరించి జాతీయ కమిషన్‌ను బలోపేతం చేయడం, విద్యా రంగంలో అక్రమాల నివారణ, అందుకు పాల్పడితే శిక్ష-వంటి వాటిపై ఒక చట్టాన్ని తేవడం, విదేశీ విద్యా సంస్థల ప్రవేశం, నియంత్రణలకు చట్టం తీసుకురావడం తదితర కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టాలని కూడా కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు బ్రెయిన్ గెయిన్ అనే కొత్త విధానానికి రూపకల్పన, మదరసాల- కాపీరైట్ కార్యాలయాల ఆధునికీకరణ, సెమిస్టర్ పద్ధతి, క్రెడిట్‌లు ఇచ్చే వ్యవస్థలో సంస్కరణలు, సిలబస్‌ను క్రమం తప్పకుండా సమీక్షించడం, పరిశోధనలకు ప్రోత్సాహమివ్వడం తదితర మార్పులకూ కేంద్రం సుముఖంగా ఉంది. వీటిలో కొన్నిటికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అవి చట్టాలుగా మారాల్సి ఉంది. ఇలాంటి పథకాలు, సంస్కరణలకు 445 వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం వాదన. ఇందులో పాఠశాల విద్యకు 290.9 వేల కోట్లు, ఉన్నత విద్యకు 154.29 వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. ఇంత పెద్ద మొత్తం సమకూర్చడం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలకు అసాధ్యమనే చెప్పాలి. అంటే ఈ ప్రణాళికలు, ప్రకటనలు, ప్రచారం అంతా ఒట్టి కన్నీటి తుడుపేనని స్పష్టమవుతోంది. దేశంలో 1046 అనుమతుల్లేని ఉన్నత విద్యా సంస్థలున్నా.. వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
ఆలోచనలకు ఆలంబన:
విద్యార్థి ఆలోచనలను పసిగట్టి వాటికి ఆలంబనగా నిలిచి.. అవి బలంగా పుంజుకుని రెక్కలు తొడగడానికి దోహదపడేదే విశ్వవిద్యాలయమని ప్రొఫెసర్ యశ్‌పాల్ కమిటీ పేర్కొంది. కనీసం ఆ దిశలో కూడా మన విద్యా రంగ నిపుణులు, పాలకులు ఆలోచించడం లేదు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేయడంలేదు. విశ్వవిద్యాలయాలకు, పరిశ్రమలకు మధ్య నిరంతర అనుసంధానం అవసరమన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. ప్రాథమిక అంశాలను విస్మరించి ఎన్ని చట్టాలు, సంస్కరణలు తీసుకొచ్చినా అనుకున్న లక్ష్యం అందుకోవడం అసాధ్యమే. కార్యాచరణ వాస్తవాల ప్రాతిపదికపై రూపుదిద్దుకోవాలి. బోధన, నాణ్యత, పరీక్షల ప్రమాణాలు, పరిశోధన వంటి వాటిపై నిరంతరం ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. ఆ ప్రయత్నమూ ఏదశలోనూ జరగడం లేదు.
రాష్ట్రంలో ప్రాథమిక విద్యారంగం:
= రాష్ట్రంలో ప్రస్తుతం 57,026 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 30మందిలోపు విద్యార్థులున్నవి 20,040. ఏకోపాధ్యాయ పాఠశాలలు 5 వేల వరకు ఉన్నాయి. 1.36 కోట్ల మంది ప్రాథమిక స్థాయి విద్యార్థులున్నారు. అందులో 40 లక్షల మంది ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు. అంటే ఆర్‌టీఈ ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25శాతం సీట్లను బలహీనవర్గాలకు కేటాయిస్తే.. అప్పుడు వారి సంఖ్య పది లక్షలకు చేరుతుంది. వీరికి నెలకు సగటున తలసరి రూ.500 చొప్పున.. ప్రైవేటు పాఠశాలలకు నెలకు రూ.50 కోట్లు చెల్లించాలి.
= ఆర్‌టీఈ ప్రకారం ఒక్కో స్కూల్లో కనీసం 30 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉండాలి.
= రాష్ట్రంలో లక్షన్నర మంది బాల కార్మికులున్నారని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. బడికి వెళ్లని పిల్లలు 1.41 లక్షల మంది ఉంటారని అంచనా. వీరందర్నీ బడికి పంపాలంటే కిలోమీటరుకు ఒక పాఠశాలను నిర్మించాలి.
-ముత్యాల ప్రసాద్
విద్యాహక్కుకు న్యాయపరమైన నిర్వచనం
1993లో సుప్రీంకోర్టు (ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం) భారతదేశంలో విద్యారంగ స్థానాన్ని నిర్వచిస్తూ... రాజ్యాంగంలోని 45, 41 అధికరణాల ప్రకారం విద్యా హక్కు అంటే...
= దేశంలోని ప్రతి బిడ్డా/పౌరుడు లేదా పౌరురాలు 14 ఏళ్లదాకా ఉచిత విద్య పొందే హక్కు కలిగి ఉంటారు.
= 14ఏళ్లు దాటాక విద్యాహక్కు, ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం, అభివృద్ధి లాంటి అంశాలమీద ఆధారపడి ఉంటుంది.
= 14ఏళ్ల దాకా దేశంలో పిల్లలందరికీ ఉచిత విద్యాహక్కుందని 45వ అధికరణం స్పష్టంగా చెబుతోంది. ఇంకా దీని గురించి ప్రస్తావించిన ఇతర అధికరణాలు, క్లాజుల్లో ఇంకేదీ 14 ఏళ్ల వయోపరిమితి గురించి ప్రస్తావించలేదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని ప్రభుత్వాలు గుర్తించి, గౌరవించాలి. 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలి.. అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఐదు కీలక బిల్లులు
విద్యాహక్కు చట్టం, విదేశీ వర్సిటీల ప్రవేశం బిల్లుతో విద్యా రంగంలో కదలిక తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు సంబంధించిన ఐదు కొత్త బిల్లులను పార్లమెంటు ముందుకు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వీటన్నింటికీ ఇప్పటికే కేబినెట్ ఆమోదం లభించింది.
అవి..
= జాతీయ ఉన్నత విద్యా పరిశోధనల కమిషన్ (National Commission for higher Education and Research Bill):
దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి చట్టాలకు బదులుగా ఈ జాతీయ ఉన్నత విద్యా పరిశోధనల కమిషన్‌ను తీసుకురావాలని యశ్‌పాల్ కమిటీ సిఫార్సు చేసింది. శామ్ పిట్రోడా నేతృత్వంలోని జాతీయ నాలెడ్జ్ కమిషన్ కూడా దీన్ని సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం తరహాలో దీనికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తారు. వ్యవసాయం, వైద్య విద్యలు తప్ప దేశంలోని వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలన్నీ దీని పరిధిలో ఉంటాయి. కోర్సుల నాణ్యత, అధ్యాపకుల ప్రతిభ, వీసీల అర్హతలు, వర్సిటీలకు నిధుల కేటాయింపు, కొత్త కాలేజీలకు అనుమతులు తదితర అధికారాలన్నీ దీనికే చెందుతాయి. ఈ కమిషన్‌కు ఒక చైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈ కమిషన్‌కు సివిల్ ప్రొసీజర్ 1908 ప్రకారం సివిల్ కోర్టులకుండే అన్ని అధికారాలూ ఉంటాయి.
= జాతీయ విద్యాట్రిబ్యునళ్ల బిల్లు(National Education Tribunals Bill):
ఉన్నత విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది వివాదాలను విచారించి తీర్పులు ఇస్తుంది. ఉన్నత విద్యారంగ నియంత్రణకు సంబంధించిన వివాదాలు, రెండుమూడు రాష్ట్రాల్లో పనిచేసే విద్యాసంస్థల సమస్యలను పరిష్కరిస్తుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్ల తీర్పులపై దీనిలో అప్పీలు చేసుకోవచ్చు.
= జాతీయ అక్రిడిటేషన్ అథారిటీ బిల్లు (National Authority for regulation in Accreditation of Higher Educational institutions Bill): జాతీయ ఉన్నత విద్యా కమిషన్ నిర్దేశించే ప్రమాణాలను ఉన్నత విద్యా సంస్థలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పారదర్శకంగా సమీక్షించి వాటి గుర్తింపు కొనసాగించాలా, వద్దా అనేది నిర్ణయిస్తుంది. విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, అధ్యాపకుల సంఖ్య, సిబ్బంది పనితీరు, అడ్మినిస్ట్రేషన్ వంటి అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తుంది. ఇది స్వతంత్ర నియంత్రణా సంస్థ.
= సాంకేతిక, వైద్య, ఉన్నత విద్యాసంస్థల్లో అక్రమ పద్ధతులు నిషేధం బిల్లు (Unfair Practices in Technical, Medical, Educational institutions and Varsities Bill):
ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు నిబంధనలు పాటించేలా పర్యవేక్షిస్తుంది. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతుంది. క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్ల వసూలు, తీసుకున్న మొత్తాలకు విద్యార్థులకు రశీదులు ఇవ్వకపోవడం, మోసపూరిత ప్రకటనలు జారీచేయడం, అర్హతలేని బోధనా సిబ్బందిని నియమించడం, విద్యార్థులకు సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు ఇవ్వడంలో ఇబ్బందికి గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే విద్యాసంస్థలపై చర్యలకు ఈ బిల్లు ఉద్దేశించింది. అక్రమాలకు పాల్పడే ప్రైవేటు వృత్తి విద్యా సంస్థలు, వాటి యాజమాన్యాలపై కఠిన శిక్షలు విధిస్తుంది. ప్రస్తుతం కాలేజీలు అనుసరిస్తున్న 25 తప్పుడు పద్ధతులను నిషేధిస్తూ ఈ బిల్లు తీసుకువస్తున్నారు.
= విదేశీ విద్యా సంస్థల బిల్లు (Foreign Education provider Bill):
దీన్ని ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దేశంలో విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు ఏర్పాటుకు ఇది అనుమతి ఇస్తోంది. దీని వల్ల ఏటా రూ. 37,500కోట్లు మిగులుతాయని అంచనా. మన దేశం నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు ఇతర దేశాల వర్సిటీల్లో చదువుకునేందుకు వెళుతున్నారు. దాంతో ఏటా రూ.50 వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం బయటకు పోతోంది. విదేశీ వర్సిటీలు ఇక్కడకే వస్తే ఈ డబ్బు మిగులుతుందని పేర్కొంటున్నారు
No comments:
Post a Comment