Saturday, 5 January 2013

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్య్య


ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్య్య
విద్య ప్రాథమిక హక్కు. 14 ఏళ్లలోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత సార్వత్రిక ప్రాథమిక విద్య అందించడం రాజ్య వ్యవస్థ బాధ్యత అని రాజ్యాంగంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 లో ఆదేశిక సూత్రాల్లో విద్య గురించి ప్రస్తావించారు. 93వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఆర్టికల్ 21(ఏ)లో చేరుస్తూ, ప్రాథమిక హక్కుగా గుర్తించారు. రాజ్యాంగం విద్యాహక్కు గురించి ఏం చెబుతుందో 21(ఏ) అధికరణం వివరిస్తోంది.
దీని ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలందరికీ సార్వత్రిక నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత రాజ్య వ్యవస్థపై ఉంది. ఈ బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించడానికి ప్రాథమిక విద్యను 'సర్వశిక్షా అభియాన్' పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ పథకాన్ని విద్యాహక్కు చట్టానికి అనుసంధానించారు. సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో సర్వశిక్షా అభియాన్‌దే ప్రధాన భూమిక. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మాధ్యమిక విద్యను కూడా సార్వత్రికం చేయడానికి 'రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌'ను ప్రారంభించింది. పాఠశాల విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఈ రెండు పథకాలపై ఉంది. దీంట్లో భాగంగా పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావడం, బడిలో పిల్లలను నమోదు చేసుకోవడం, చేరిన పిల్లలను బడిలో నిలుపుకోవడం, నాణ్యమైన బోధన అందించడం లాంటివి చేపట్టాలి.
2015 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని 2011-12 సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే వివిధ పథకాలను అమలు చేస్తున్నారు. పరిమాణాత్మకంగానే కాకుండా గుణాత్మకంగానూ విద్య, అక్షరాస్యతలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ అంశాన్ని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై చేసిన సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
సార్వత్రిక పాఠశాల విద్య
సార్వత్రిక విద్యా లక్ష్యాన్ని చేరాలంటే విద్యారంగంలో నిర్దిష్ట అంచనాలను, లక్ష్యాలను సాధించాలి. ప్రతి నివాస ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలోనే ప్రాథమిక పాఠశాల, అయిదు కిలోమీటర్ల పరిధిలోనే మాధ్యమిక ఉన్నత పాఠశాల అందుబాటులో ఉండాలి. ఈ లక్ష్యం విషయంలో రాష్ట్రం విశేష విజయాలను సాధించింది. 99 శాతం మేర ప్రాథమిక పాఠశాలలు లక్ష్యానికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. మాధ్యమిక పాఠశాలలు 91.5 శాతం మేర అందుబాటులో ఉన్నాయి. పాఠశాలలు అందుబాటులో లేని ప్రదేశాల్లో నిబంధనల మేరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించడం వల్లే ఇది సాధ్యమైందని సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.
2010-11లో 66,834 ప్రాథమిక, 15,421 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. మాధ్యమిక విద్యలో 18,776 ఉన్నత పాఠశాలలున్నాయి. 173 మాధ్యమికోన్నత పాఠశాలలున్నాయి. ఈ అన్ని రకాల పాఠశాలల మొత్తం 1,01,204.
బడిలో పిల్లల నమోదు
ఇప్పటివరకూ విద్య అందుబాటులో లేని ఆవాస ప్రాంతాలు, చిన్న ఆవాస ప్రాంతాలకు 100 శాతం పాఠశాలలను అందుబాటులోకి తేవడంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను బలోపేతం చేయడం, కొత్తగా ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడం, ప్రత్యామ్నాయ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయడం, ఇతర రకాల విద్యా సదుపాయాలను కల్పించడం లాంటివి ఈ వ్యూహంలోని ముఖ్యాంశాలు. 
2010-11లో రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో నమోదైన పిల్లల సంఖ్య 133.18 లక్షలు. వీరిలో 54.64 లక్షల మంది ప్రాథమిక పాఠశాలల్లో, 23.30 లక్షల మంది ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 53.97 లక్షల మంది ఉన్నత పాఠశాలల్లో ఉన్నారు. 1.27 లక్షల మంది మాధ్యమికోన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. అంటే ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న పిల్లలు మొత్తం బడిలో ఉన్న పిల్లల్లో 53.49 శాతం కాగా 18.96 శాతం మంది ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్నారు. 24.45 శాతం మంది మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్నారు. ఇక మిగిలిన 3.10 శాతం ప్రీ ప్రైమరీ లేదా మాధ్యమికోన్నత పాఠశాలల్లో ఉన్నారు (సీబీఎస్ఈ పాఠశాలలు).
మధ్యలో బడి మానేసేవారి సంఖ్య
సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించే లక్ష్యంలో అతి పెద్ద సవాల్ బడిలో చేరిన పిల్లలను నిలుపుకోవడం, ప్రాథమిక విద్యాస్థాయిలో బడి మానేసే వారు 2010-11లో 17.43 శాతం. ఇది ప్రాథమికోన్నత స్థాయిలో 22.34 శాతంగా; ఉన్నత పాఠశాలల స్థాయిలో 46.21 శాతంగా ఉంది. నమోదైన పిల్లలందరూ పాఠశాల విద్యను పూర్తిచేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలి.
2010-11లో రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 4,76,555. వీరిలో ప్రాథమిక పాఠశాలల్లో 1,74,079 మంది; ప్రాథమికోన్నత పాఠశాలల్లో 93,003 మంది; ఉన్నత పాఠశాలల్లో 2,05,179 మంది పని చేస్తున్నారు. మిగిలిన 4,304 మంది ఉపాధ్యాయులు మాధ్యమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
ఉపాధ్యాయులు, పిల్లల నిష్పత్తి
విద్యను మెరుగుపరచడంలో అతి ముఖ్యమైన అంశం ఉపాధ్యాయులకు, పిల్లలకు మధ్య నిష్పత్తి. 2010-11లో రాష్ట్రంలో విద్యా వాలంటీర్లతో కలిపి ఈ నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 26గా, ప్రాథమికోన్నత స్థాయిలో 21గా, ఉన్నత పాఠశాల స్థాయిలో 25గా ఉంది.
పరీక్షల ఫలితాలు విద్యారంగ స్థితిగతులకు ప్రామాణికాలుగా ఉంటాయి. పదోతరగతిలో ఉత్తీర్ణతా శాతం 2010-11లో 83.10. ఇది అంతకు ముందున్న 81.63 శాతం కంటే స్వల్పంగా అధికం.
మధ్యాహ్న భోజన పథకం
రాష్ట్రంలో ఒకటి నుంచి అయిదు తరగతుల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని 2003 జనవరి నుంచి అమలు చేస్తున్నారు. 2007లో దీన్ని ఆరు నుంచి ఎనిమిది తరగతులకు; 2008లో తొమ్మిది, పదోతరగతులకు కూడా విస్తరించారు. కేంద్రప్రభుత్వ పథకమైన మధ్యాహ్న భోజనం అమలుకయ్యే ఖర్చులో 75% శాతం కేంద్రం, మిగిలిన 25% శాతం రాష్ట్రం భరిస్తున్నాయి. కేంద్ర పథకాన్ని కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే అమలు చేస్తారు. అయితే తొమ్మిది, పదోతరగతులకు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం 100 శాతం నిధులను సమకూరుస్తుంది. ఈ పథకం ముఖ్య లక్ష్యాలు: పిల్లల్లో పౌష్టికాహార స్థితిగతులను మెరుగుపరచడం, క్రమం తప్పకుండా బడికి వచ్చేలా ప్రోత్సహించడం. 2011-12లో రాష్ట్రంలో 78.04 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించారు. వీరిలో 40.96 లక్షల మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. 22.61 లక్షల మంది పిల్లలు ప్రాథమికోన్నత; 14.22 లక్షలమంది ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. 0.25 లక్షల మంది జాతీయ బాల కార్మిక ప్రాజెక్టుల్లోని వారు.
2008-09 నుంచి రాష్ట్రంలోని 5000 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందిస్తున్నారని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. 2010-11 నుంచి 1300 ఉన్నత పాఠశాలల్లో అమలవుతోంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే. దీనికోసం అయ్యే ఖర్చులో 75 శాతం కేంద్రం, మిగిలిన 25 శాతం రాష్ట్రం భరిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వృత్తి విద్యా కోర్సులను 1984-85 నుంచి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 313 ఉన్నత పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నారు. వృత్తి విద్యను అభ్యసించే పిల్లల సంఖ్య 34,800.
రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా ప్రాథమిక విద్యలో వచ్చిన అనుభవాల నేపథ్యంలో మాధ్యమిక విద్యను సార్వత్రికం చేసే లక్ష్యంతో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ను ప్రారంభించారు. అయిదేళ్ల కాలంలో తొమ్మిది, పదో తరగతుల్లో పిల్లల నమోదును 75 శాతానికి తీసుకు రావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకం (ఆర్ఎంఎస్ఏ) మొత్తం 10,368 పాఠశాలల్లో అమలవుతోంది. ఇందులో 8326 పాఠశాలలు జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్నవి కాగా 308 మున్సిపల్ పాఠశాలలు, 1734 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా 21,76,198 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. మన రాష్ట్రంలో ఆర్ఎంఎస్ఏ ద్వారా మాధ్యమిక విద్యా స్థాయిలో పిల్లల నమోదును ప్రస్తుతం ఉన్న 68.7 శాతం నుంచి 100 శాతానికి పెంచాలన్నది లక్ష్యం. ఈ పథకం అమలుకయ్యే ఖర్చులో 75 శాతం కేంద్రం; మిగిలిన 25 శాతం రాష్ట్రప్రభుత్వం భరించాలి.
సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడానికి మన రాష్ట్రంలో మూడు పథకాలు అమలవుతున్నాయి. ఇవి: సర్వశిక్షా అభియాన్, ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమం, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు.
రాష్ట్రంలో 2001-02 నుంచి సర్వశిక్షా అభియాన్ అమలవుతోంది. ప్రాథమిక విద్యలోని సామాజిక, లింగ, ప్రాంతీయ అసమానతలను అధిగమించడం దీని లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం 2003లో జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది సర్వశిక్షా అభియాన్‌కు సవరణగా వచ్చింది. బాలికల విద్యను ప్రోత్సహించడానికి అదనపు కృషి చేయడం దీని ఉద్దేశం. 2001 జనాభా లెక్కల ప్రకారం సగటు జాతీయ మహిళా అక్షరాస్యతా రేటైన 46.13 శాతం కంటే తక్కువ ఉన్న; స్త్రీ, పురుష అక్షరాస్యతలో తేడా 21.59 శాతం కంటే ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ ప్రాతిపదికన 23 జిల్లాలు, 661 మండలాల్లో ఈ పథకం అమలవుతోంది. భారత ప్రభుత్వం 2004-05 నుంచి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ పథకాన్ని ప్రారంభించింది. విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో ప్రధానంగా షెడ్యుల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలకు వసతితో పాటు విద్యను అందించే పథకం ఇది. రాష్ట్రంలో మొత్తం 743 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో చదువుతున్న బాలికల సంఖ్య 80,927.
1964 లో రాష్ట్రంలో మాధ్యమిక విద్యలో మార్పును తీసుకొస్తూ విధాన పరమైన నిర్ణయం తీసుకున్నారు. మాధ్యమిక విద్యను అప్పటి వరకు ఉన్న 11 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు తగ్గించారు. ఈ నిర్ణయం ద్వారానే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 + 2 + 3 పద్ధతిలో భాగంగా ప్లస్ 2 స్థాయి విద్యను (ఇంటర్మీడియట్ విద్యను) 1969-70 నుంచి ప్రారంభించారు. 1989 నుంచి ఉన్నత విద్య డైరెక్టరేట్‌ను ఇంటర్మీడియట్ డైరెక్టరేట్, కాలేజియేట్ డైరెక్టరేట్‌గా విభజించారు. ఆ విధంగా మన రాష్ట్రంలో 1989 నుంచి ఇంటర్మీడియట్ డైరెక్టరేట్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 806 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 12 ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలు; 205 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా ప్రైవేట్ కళాశాలలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్ కళాశాలలు కలిపి 5202 ఉన్నాయి

No comments:

Post a Comment