Saturday, 5 January 2013

వెలుగుతున్న గుజరాత్‌.. అంధకారంలో ఆంధ్రప్రదేశ్‌


వెలుగుతున్న గుజరాత్‌.. అంధకారంలో ఆంధ్రప్రదేశ్‌
* స్పష్టమైన ప్రణాళికతో వెళ్తున్న తోటి రాష్ట్రం
* ప్రాజెక్టులకు పెట్టుబడి అందిస్తున్న ప్రభుత్వం
* మనరాష్ట్రంలో గతి తప్పిన విద్యుత్తు ప్రణాళిక
* చిత్తశుద్ధిలేని నేతలు, ప్రణాళిక లేని పార్టీలు
'ప్రగతిశీల గుజరాత్‌'.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి బోర్డులే కనిపిస్తుంటాయి. మన దగ్గర మాత్రం 'విద్యుత్తు లేని కారణంగా పరిశ్రమను మూతపెట్టామనే' బోర్డులు కనిపిస్తున్నాయి. ఎంత చిత్రం! మనకన్నా చిన్న రాష్ట్రం ఇలా వెలిగిపోడానికి కారణమేంటి? ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి సౌరభ్‌ పటేల్‌ మాటల్లో చెప్పాలంటే 'బలమైన రాజకీయ చిత్తశుద్ధే!' ఆరేళ్ల క్రితం.. గుజరాత్‌లో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 11,210 మెగావాట్లు. రోజూ 2,600 మెగావాట్ల లోటు ఏర్పడటంతో పరిశ్రమలు, వాణిజ్యవర్గాలు, గృహవినియోగదారులకు భారీగా కోతలు ఉండేవి. ఆ దశ నుంచి నేడు 23,086 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకోవడంతోపాటు మిగులును సాధించి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే దశకు చేరింది. ఛార్జీలు ఎక్కువ ఉండవచ్చుగాక... అక్కడ కరెంటు పోతే ఒట్టే!!
'నూరు ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందని' సామెత. మన రాష్ట్రంలోని రాజకీయ నాయకుల తీరు ఇలాగే ఉంది. ఉన్న వనరుల్ని, ప్రణాళికలను సర్వనాశనం చేసిన నేతలు జనానికి మాత్రం అన్నీ ఉచితంగానే ధారపోసి ఉద్ధరిస్తామంటూ వూదరగొడుతుంటారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనిలేదు.. పోటీపడి మరీ ఏదైనా ఉచితంగా ఇస్తామని చెప్పడమే తప్ప మెరుగ్గా పనిచేస్తామని కాని, పథకాలను మెరుగు పరుస్తామని కాని చెప్పకపోవడమే విషాదం.
ఒకవైపు ప్రపంచమంతా వేగంగా మారిపోతోంది. ప్రతీ నిమిషాన్నీ సద్వినియోగపరచుకోవడమే నేటి ఆధునిక ప్రపంచ సూత్రం.. ఒక్క నిమిషం సెల్‌ నెట్‌వర్క్‌ ఆగిపోతే భరించలేరు నేటి కుర్రకారు... ఒక్క గంట ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఆగిపోతే ప్రపంచం తలకిందులైపోతుంది... ఒప్పందం ప్రకారం ఉత్పత్తిని సకాలంలో అందించలేకపోతే కోట్ల విలువైన ఆర్డర్‌ను కోల్పోతారు పారిశ్రామికవేత్త.
ఇలాంటి కాలంలో కూడా రోజుకు పది పన్నెండు గంటలపాటు కరెంటు లేకుండా కూర్చోవడం అంటే... సమాజాన్ని మళ్లీ చీకటి యుగాల్లోకి నెట్టేసినట్లే.... మన నేతలు చేస్తున్నది అదే!
ఏదైనా ఉచితం... లేదంటే చౌకబేరం... ఇదే మన వారికి తెలిసిన విద్య. పోనీ ఈ రాయితీలైనా అర్హులకు అందుతున్నాయా అంటే అదీలేదు. నీళ్లు రాకున్నా సరే... వీధిలో మున్సిపల్‌ కుళాయి ఉండాల్సిందే. సూదిమందుకూ దిక్కు లేకున్నా ధర్మాస్పత్రిలో ఉచితవైద్యం కార్డు ఉండాల్సిందే. పురుగుల బియ్యమే పంచుతున్నా ప్రజలందరికీ తెల్లకార్డు ఉండాల్సిందే.. అంతేతప్ప ప్రజాజీవనాన్ని ఆధునికంగా మార్చలేకపోతున్నారు. 'మెరుగైన సేవలు... మెరుగైన జీవనం' అనే దిశగా ప్రజలను సిద్ధం చేయలేకపోతున్నారు. కాదు కాదు... తామే సిద్ధపడలేకపోతున్నారు. ఫలితమే ఈ దుస్థితి!
'అవసరమైన సౌకర్యాలన్నీ పొందండి... కాని అన్నింటికీ తగినంత సొమ్ము వెచ్చించండి'... అనేది ఒకప్పుడైతే కేవలం అమెరికన్‌ సూత్రం... కాని ఇప్పుడిదే ఆధునిక ప్రపంచ మంత్రం! ఎక్కడోకాదు... మన దేశంలోనే ఈ సూత్రాలను అనుసరిస్తూ గుజరాత్‌ 'వెలిగిపోతోంది'... మనం మాత్రం చీకట్లో మగ్గిపోతున్నాం. కాలం కాని కాలంలో దేశమంతా విద్యుత్తు లోటులో ఉండి సామాన్యుల నుంచి పారిశ్రామికవర్గాల వరకు అందరూ కోతలతో విలవిలలాడిపోతుండగా గుజరాత్‌లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నగరాలు, పట్టణాలే కాదు.. మారుమూల గ్రామాలకూ 24 గంటలూ విద్యుత్తు వెలుగులు పంచుతోంది. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తు అందిస్తోంది. వ్యవసాయానికి కూడా ఏకబిగిన 8 గంటలు సరఫరా చేస్తోంది. అంతేకాదు మిగులును ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటోంది.
నిజానికి ఆ రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు వనరుల్లేవు. జల వనరులూ నామమాత్రమే. గ్యాస్‌ నిక్షేపాలు కూడా పెద్ద మొత్తంలో లేవు. మరి ఇదెలా సాధ్యమైంది?
మన రాష్ట్రంలో తరగని బొగ్గు నిల్వలున్నాయి. పెద్దఎత్తున గ్యాస్‌ వనరులున్నాయి. జల విద్యుత్తు అవకాశాలు పుష్కలం. అన్నీ ఉన్నాయి కాని కరెంటే ఉండదు. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా గంటల కొద్దీ కోతలతో జనం నరకయాతన పడుతున్నారు. వ్యవసాయానికి మూడు గంటలు కూడా కనాకష్టమైపోతోంది. పరిశ్రమలు నెలకు 12 రోజులు మూతపడుతున్నాయి. ఈ దుస్థితి ఎందుకొచ్చింది? రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడమే దీనికి కారణం.
గుజరాత్‌లో ఏం జరుగుతోంది?
ఆ రాష్ట్ర విద్యుత్తు స్థాపక సామర్థ్యం 23,086 మెగావాట్లు. గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు పూర్తిచేసింది. గ్యాస్‌తోపాటు బొగ్గు, లిగ్నైట్‌ ఆధారిత విద్యుదుత్పత్తికి సమ ప్రాధాన్యం ఇచ్చింది. త్వరగా అనుమతులు, భూమి, నీరు కేటాయించడమే కాకుండా భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. వీటికి అదనంగా సౌర విద్యుత్తు రంగంలో ఏడాదిలో 600 మెగావాట్లు స్థాపించడం గమనార్హం. అలానే పవన విద్యుత్తు 2,500 మెగావాట్ల సామర్థ్యాన్ని జత చేసింది. విదేశాల నుంచి బొగ్గు, ఆర్‌ఎల్‌ఎన్‌ గ్యాస్‌ దిగుమతి చేసుకుని ఉత్పత్తికి ఆటంకం తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది.
ప్రత్యామ్నాయ మార్గాలూ అనుసరణీయం
గుజరాత్‌ ఒకవైపు విద్యుత్తు సామర్థ్యం పెంచుతూనే మరోవైపు దీర్ఘకాల (25 ఏళ్లు) విద్యుత్తు సరఫరా చేసేందుకు కేస్‌-1 టెండర్ల ద్వారా ఒప్పందాలు చేసుకుంది. 2006 లోనే 3200 మెగావాట్లకు యూనిట్‌ రూ.2.25 నుంచి రూ.2.80 చొప్పున కొనుగోలుకు అంగీకరించింది. 2009లో మరోసారి 2610 మెగావాట్లకు ఒప్పందాలు చేసుకుంది. ఈ విద్యుత్తు మొత్తం బయట మార్కెట్‌ నుంచి వస్తుంది.
గుజరాత్‌లో మొత్తం సామర్థ్యం 23,086 మెగావాట్లు కాగా అక్కడ అత్యధిక డిమాండ్‌ 12,200 మెగావాట్లు మాత్రమే. పూర్తిస్థాయిలో ఉత్పత్తి కొనసాగిస్తున్న గుజరాత్‌ విద్యుత్తు సంస్థలు అన్ని వర్గాలకు కోతలు లేకుండా సరఫరా చేస్తున్నాయి. మిగిలిన విద్యుత్తును బయటకు అమ్ముతున్నాయి.
వారి ప్రణాళికలు ఎంతో ఘనం...
భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గుజరాత్‌లో స్వల్పకాల, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది. 2002 నాటికి 8,615 మెగావాట్లు సామర్థ్యంతో ఉన్న ఆ రాష్ట్రం పదేళ్లకాలంలో 18,828 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకుంది. 2017 నాటికి సామర్థ్యం 33,351 మెగావాట్లకు పెంచుకోవడం లక్ష్యంగా ఆ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రణాళికలు రూపొందించడమే కాకుండా ఆచరణలో పెడుతోంది. అలానే 2017 నాటికి 5వేల మెగావాట్లు పవన, 2000 మెగావాట్లు సౌర, మరో 280 మెగావాట్లు బయోమాస్‌, చిన్నతరహా జల విద్యుత్తు ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది.
మనరాష్ట్రంలో పరిస్థితి ఏమిటి?
రాష్ట్రంలో పూర్తి స్థాపక సామర్థ్యం 16,384 మెగావాట్లు. జల, బొగ్గు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్తుపై ఎక్కువ ఆధారపడుతున్నాం. జల విద్యుత్తు సీజన్‌ను బట్టి మూడునెలలకు మించి వస్తే వస్తుంది లేదంటే లేదు. ఇక గ్యాస్‌ కూడా సరఫరా లేక ప్రాజెక్టులు మూతపడుతున్నాయి. గుజరాత్‌లో దిగుమతి చేసుకున్న ఆర్‌ఎల్‌ఎన్‌ గ్యాస్‌తో ఉత్పత్తి చేస్తుంటే.. ఇక్కడ ఆ పరిస్థితి లేదు.
అవసరాలకు అనుగుణంగా కొత్త విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణంపై కార్యాచరణ ప్రణాళిక ఉండట్లేదు. ప్రైవేటు ప్రాజెక్టులపై ప్రభుత్వానికి కనీస సమాచారం లేకపోవడం ఈ రంగంలో ప్రభుత్వ విధాన లోపానికి నిదర్శనం. ప్రభుత్వ నుంచి ఏపీజెన్‌కో ప్రాజెక్టులకు ఒక్కపైసా పెట్టుబడి వాటా అందించడం లేదు. కనీసం అనుమతుల విషయంలోనూ ప్రభుత్వ మద్దతు లేదు. ఫలితంగా ఏపీజెన్‌కో ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో పదేళ్లయినా ఇవే విద్యుత్తు కోతలు తప్పవన్నట్లే!
ఇక్కడ 9 వేల మెగావాట్లు పవన విద్యుత్తు ఉత్పత్తికీ, అలానే మెగావాట్లు సౌర విద్యుదుత్పత్తికీ అవకాశం ఉంది. అన్ని రంగాల్లో కలిపి సంప్రదాయేతర రంగంలో 903 మెగావాట్లు మించకపోవడం గమనార్హం.
మనరాష్ట్రం కూడా గుజరాత్‌ తరహాలోనే దీర్ఘకాల సరఫరా ఒప్పందాల కోసం 2010 లోనే కేస్‌-1 టెండర్లను పిలిచింది. 2011 ఫిబ్రవరిలో టెండర్లు తెరిచింది. యూనిట్‌ రూ.3.46 నుంచి రూ.3.70 చొప్పున 8,000 మెగావాట్లు సరఫరా చేయడానికి ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ రాజకీయాలు, న్యాయవివాదాలు, విధానపరమైన లోపాలతో ఆ టెండర్లు పూర్తికాలేదు.
ప్రస్తుత పీక్‌ డిమాండ్‌ 12,800 మెగావాట్లే కానీ జల, గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి గండిపడటంతో మనం కోతలతో అల్లాడిపోతున్నాం.
మనకు గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులు ప్రైవేటు, ప్రభుత్వరంగంలో కలుపుకుని 6400 మెగావాట్లు సామర్థ్యం ఉంది. ఈ మొత్తానికి గ్యాస్‌ సరఫరా చేస్తే కోతలు లేకుండా విద్యుత్తు ఇవ్వడమే కాకుండా మరికొంత మిగులుతుంది కూడా. ఇక్కడ ఆర్‌ఎల్‌ఎన్‌ గ్యాస్‌ కోసం టెర్మినల్‌ నిర్మిస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకుని గ్యాస్‌ అందుబాటులో లేనప్పుడు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
మనకేది ప్రణాళిక, కార్యాచరణ?
ఆంధ్రప్రదేశ్‌లో 2014 నాటికి ప్రభుత్వ, ప్రైవేటురంగంలో కలిపి 6,279 మెగావాట్లు సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు విద్యుత్తు సంస్థలు ప్రకటించాయి. కానీ ఇందులో కేవలం 2,440 మెగావాట్లు సామర్థ్యంతో నిర్మిస్తున్న ఏపీజెన్‌కో ప్రాజెక్టులు మాత్రమే నిర్దేశిత గడువులోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇక దీర్ఘకాలంలో ఏపీజెన్‌కో 16,000 మెగావాట్లతో ప్రణాళికలు వేసింది. అయితే వీటికి బొగ్గు, గ్యాస్‌ లింకేజీ సాధించడం గగనంగా మారుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపడంతోపాటు ప్రాజెక్టుల్లో పెట్టుబడి వాటా అందిస్తే గడువులోగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో రెండేళ్లకాలంలో 1000 మెగావాట్లు పవన విద్యుత్తు, మరో 600 మెగావాట్లు సౌర విద్యుత్తు ప్రాజెక్టులు పూర్తిచేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే దీనికి స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణ లేదు. అంతేకాదు ప్రైవేటురంగంలో వస్తున్న ప్రాజెక్టులపై గుజరాత్‌ ప్రభుత్వం ఎంతోకొంత నియంత్రణ పాటిస్తుంటే.. మనరాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మిస్తున్నదీ కనీస సమాచారం లేకపోవడం గమనార్హం

No comments:

Post a Comment