| EAMCET - 2013 PREPARATION PLAN |
|---|
| ఎంసెట్ వ్యూహం! |
పేరున్న కళాశాలలో, ఇష్టమైన బ్రాంచిలో ఇంజినీరింగ్ చదవాలి. నాలుగేళ్ళూ కష్టపడి చదివితే ఇక భవితకు తిరుగే ఉండదు!... ఎంపీసీ విద్యార్థుల అంతరంగమిది. దీనికి పునాది ఎంసెట్‌లో మంచి ర్యాంకు. దీన్ని సాధించటానికి పటిష్ఠంగా వ్యూహం రూపొందించుకోవాలి కదా! అదెలాగో- చదవండి...
ఇంజినీరింగ్ ఆశావహులకు మనరాష్ట్రంలో అవసరానికి మించిన సంఖ్యలో సీట్లున్నాయి. కానీ ఇంజినీర్లుగా ఉజ్వల భవిత పొందాలంటే తొలి 5 శాతం ఎంసెట్ ర్యాంకర్లలో ఒకరుగా ఉండాల్సిందే. అప్పుడే ఆశించిన ఇంజినీరింగ్ కళాశాలలో, కోరుకున్న బ్రాంచిలో చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఇంజినీరింగ్ చేయాలనుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయ కళాశాలల్లో లేదా ప్రసిద్ధ (టాప్ 20) ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సాధించే ర్యాంకు తెచ్చుకోవాలి. ఎంసెట్ ప్రణాళికను ఆ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించుకోవాలి.
మార్కులకు మెలకువలు
ఉదాహరణకు- భౌతికశాస్త్రంలో 1) శుద్ధ గతికశాస్త్రం నుంచి ఒక ప్రశ్న వస్తుంది 2) ప్రమాణాలు-మితులు నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. కానీ రెండోది చాలా చిన్న అధ్యాయం. తప్పులు చేసే అవకాశాలు కూడా తక్కువ. కాబట్టి ఇటువంటి అధ్యాయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అనుకూలంగా మల్చుకుని... ఎంసెట్‌లో పాసవడానికి ప్రతి సబ్జెక్టులో కనీస మార్కులుండాలనే నిబంధన లేదు. అందుకే విద్యార్థులు తమకు పట్టు ఉన్న సబ్జెక్టులో ఎక్కువ పొంది, వేరొకదానిలో తక్కువ మార్కులు వచ్చినా వెయ్యిలోపు ర్యాంకు పొందొచ్చు. అధికశాతం ఎంపీసీ విద్యార్థులు లెక్కలు బాగానే చేస్తారు కదా? దానిలో 80 మార్కులకు 70 మార్కులపైన సాధించి, కెమిస్ట్రీలో 40 మార్కులకు 30 మార్కులు సాధిస్తే.. ఫిజిక్స్‌లో 10-15 మార్కులు సాధించినప్పటికీ 1000 లోపు ర్యాంకు సాధ్యమే! పరీక్ష రాసేటప్పుడు సమయపు ఒత్తిడికి లోనుకాకుండా పట్టు ఉన్న సబ్జెక్టుతోనే పరీక్ష ప్రారంభించడం మేలు. జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ప్రశ్నల సంఖ్య తక్కువ కాబట్టి ఒత్తిడి ఉండదు. ఎంసెట్‌లో ఎక్కువ ప్రశ్నల వల్ల ఈ సమస్య ఉంటుంది. అందుకని ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివర్లో ప్రయత్నించాలి కానీ, పరీక్ష ప్రారంభంలో వాటికి సమయం కేటాయించకూడదు. ఎంసెట్‌లో రుణాత్మక (మైనస్) మార్కులు లేవు. తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించకుండా వదిలివేయనక్కర్లేదు. జవాబులు తెలియని అన్ని ప్రశ్నలకూ ఒకే జవాబు గుర్తిస్తే... ఎక్కువ ప్రశ్నలు కరెక్టయ్యే సంభావ్యత ఏర్పడుతుంది. ఇప్పటినుంచి చదివినా... ఎంసెట్‌కు సుమారు నాలుగు నెలల వ్యవధి ఉంది. ఇప్పటినుంచి ప్రణాళికతో చదివినా మంచి ర్యాంకు సాధించవచ్చు. ఇలా తయారు కాగలిగితే ఎంసెట్‌తో పాటు బిట్‌శాట్ లాంటి పరీక్షలు కూడా బాగా రాయవచ్చు. ఎంసెట్‌లో అకాడమీ పుస్తకాల పరిధి దాటి బయట ఒక ప్రశ్న కూడా ఇవ్వటం లేదు. అందుకని అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమై వాటిని పునశ్చరణ (రివిజన్) చేయటం మేలు. ప్రశ్నల సంఖ్య అధికం కాబట్టి ఎక్కువ నమూనా పరీక్షలు అభ్యాసం చేయాలి. ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభించినా సరిపోతుంది. ఒక అభ్యాసానికి పరిమితమై పరీక్షలు రాసేకంటే మొత్తం సిలబస్‌లో ఎక్కువ గ్రాండ్ టెస్టులు రాయటం ఎక్కువ లాభదాయకం. పరీక్ష హాల్లో లెక్కలు 1.15 గంటలు, కెమిస్ట్రీ 45 నిమిషాలు, ఫిజిక్స్ 1 గంట మించి చేయకూడదు. ఇది గరిష్ఠ అవధిగా తీసుకుని అభ్యాసం చేయాలి. కెమిస్ట్రీలో గ్రూపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటిని పోల్చడానికి వీలుగా పట్టికలు (టేబుల్స్) తయారుచేసుకుని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. సెకండియర్ ఫిజిక్స్‌లో సర్క్యూట్ డయాగ్రమ్ ఉన్న ప్రశ్నలు ఎంసెట్‌లో ఇవ్వటం లేదు. అందుకని ఆ లెక్కలు చేయడానికి సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఈ అంశాలన్నిటిపై దృష్టి పెట్టి సన్నద్ధత కొనసాగిస్తే ఎంసెట్‌లో మీకు ఎదురులేనట్లే! |



No comments:
Post a Comment