Friday, 8 February 2013

విపత్తు నిర్వహణ ప్రిపరేషన్ విధానం

విపత్తు నిర్వహణ
ప్రిపరేషన్ విధానం
విస్తృత అధ్యయనం అవసరం
ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల జనరల్‌స్టడీస్‌లో విపత్తు నిర్వహణ (డిజాస్టర్‌ మేనేమెంట్‌) కూడా ఒక సబ్జెక్టుగా ఉంది. గత కొన్ని పరీక్షాపత్రాలను పరిశీలిస్తే దీని నుంచి సరాసరి 10-15 ప్రశ్నలు వస్తున్నాయి. మిగతా సబ్జెక్టుల మాదిరిగా ఇది కూడా ప్రాధాన్యమైనదే. దీనికి ఏ విధంగా తయారవాలో పరిశీలిద్దాం.
ప్రిపరేషన్‌ సాగించే క్రమంలో ముందుగా సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అర్థంచేసుకోవాలి. ఏపీపీఎస్‌సీ ఇచ్చిన సిలబస్‌ కింది విధంగా ఉంది.
1) విపత్తు నిర్వహణ భావన. భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌ విపత్తుకు గురి అయ్యే అవకాశం

All The Best

2) భూకంపాలు, తుపానులు, సునామీలు, కరువులు, వరదలు- వీటికి కారణాలు, కలిగే ప్రభావాలు
3) మానవుని కారణాల వల్ల కలిగే విపత్తులు- నివారణ చర్యలు
4) విపత్తు దుష్ప్రభావాలను తగ్గించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు - చర్యలు
పై సిలబస్‌లో 4 విభాగాలు, తిరిగి వీటిలో ఉపవిభాగాలున్నాయి. మొదటి విభాగంలో విపత్తు నిర్వహణ అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్‌, భారతదేశంలో సునామీ, భూకంపం, వరదలు, కొండచరియలు విరగటం వంటివి తరచుగా ఏయే ప్రాంతాల్లో కలుగుతుంటాయి వంటివి చదవాలి.
రెండో విభాగంలో పూర్తిగా సహజ విపత్తులను గురించి ఉంది. ఇవి కలగడానికి ఒక ప్రాంత భౌగోళిక, వాతావరణ, పర్యావరణ కారకాలు, ఇవి ఆయా ప్రాంతాల్లో కలగడానికి కారణాలు గుర్తించి వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రకృతి విపత్తులు కలగడంవల్ల అక్కడి ప్రజలపై, ప్రాంతంపై కలిగే ప్రభావాలు, నష్టాలు మొదలైనవి చదవాలి. ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో ఈ విభాగంలోనే భూకంపాలు, సునామీ, తుపానులపై ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. అభ్యర్థులు దీనిని గమనించాలి.
మూడో విభాగంలో మానవ సంబంధ విపత్తుల గురించిన అంశాలున్నాయి. న్యూక్లియర్‌ ప్రమాదాలు, అణురియాక్టర్లు పేలడం, లీకేజీ, మానవుని చర్యల వల్ల కలిగే కార్చిచ్చు, రైలు, విమాన ప్రమాదాలు, భవనాలు కూలడం, గని సంబంధ ప్రమాదాల వంటివి ఈ కోవకు చెందుతాయి. ఇవి కలిగినప్పుడు తీసుకోవలసిన చర్యలు, ఇప్పటి వరకు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మానవ సంబంధి విపత్తులు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో గమనించి వాటిని ప్రత్యేకంగా చదవాలి.
నాలుగో విభాగంలో మానవ సంబంధ విపత్తులు సంభవించకుండా ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, విపత్తు తరువాత ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటివి చదవాలి. ప్రకృతి సంబంధ విపత్తులను ఆధునిక సాంకేతికత ద్వారా ముందుగా తెలుసుకోవడం, వీటి గురించి ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించే వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా భారతదేశం సహజ విపత్తులయిన సునామీ, వరదలు, తుపాను వంటి వాటిని గుర్తించి హెచ్చరించే వ్యవస్థలను ఏర్పాటుచేసింది. ఇటువంటి సమాచారాన్ని సేకరించి, చదవాలి.
సంవత్సరాలు, తేదీలపై ప్రత్యేక దృష్టి
గత కొన్ని ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో విపత్తులు సంభవించిన సంవత్సరాలు, తేదీలు, చనిపోయినవారి సంఖ్య, జరిగిన నష్టం వంటి వాటిపై ప్రశ్నలు అడిగారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ప్రముఖ సహజ విపత్తుల్లో ఈ రకమైన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
1) 11-3-2012 నాటికి ఏదేశపు భూకంపం, సునామీవల్ల వేలాది మంది చనిపోయి ఒక సంవత్సరం అయింది? 
ఎ) మెక్సికో బి) ఫిలిఫ్పైన్స్‌ సి) ఇండోనేషియా డి) జపాన్‌ 
జవాబు: డి
పదేపదే అవే ప్రశ్నలు
అన్ని జనరల్‌స్టడీస్‌ పేపర్లలో విపత్తు నిర్వహణపై కొన్ని ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. ప్రతి పేపర్‌లో అడిగే 10 నుంచి 15 ప్రశ్నల్లో కనీసం 5 ప్రశ్నలు దాదాపు పాతవే. కాబట్టి గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా చదవాలి. కొన్నిసార్లు ఒకే ప్రశ్న 4 నుంచి 5 సార్లు వివిధ పరీక్షల్లో అడిగారు.
ఉదాహరణకు కింది ఉదాహరణ పరిశీలిద్దాం.
1) విపత్తు నిర్వహణములో అంతర్భాగాలు 
ఎ) పునర్నివాసం బి) పునర్‌ నిర్మాణం సి) నివారణ డి) పైవన్నీ
జవాబు: డి
భారతదేశంలో విపత్తు నిర్వహణ
సిలబస్‌ అంశాలతోపాటు చదవాల్సిన మరొక టాపిక్‌- భారతదేశంలో విపత్తు నిర్వహణ. దీనిలో అంశాలైన నేషనల్‌ డిజాస్టర్‌ మేనేమెంట్‌ అథారిటీ, దీని విధులు, చేపడుతున్న చర్యలు, దీని అధ్యక్షులు, ఏర్పడిన సంవత్సరం, విపత్తు నిర్వహణ కాంగ్రెస్‌, వరదలు, భూకంపాలపై విడుదలచేసిన పటాలు, విపత్తు నిర్వహణలో పాలుపంచుకునే సంస్థలు అవి ఉండేచోటు, శిక్షణ కార్యక్రమాలు, జాతీయ విపత్తు నిర్వహణా చట్టం, వివిధ విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే మంత్రిత్వశాఖలు వంటివి ఎక్కువగా చదవాలి.
జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌ కోణం
విపత్తు నిర్వహణలో జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌ (వర్తమాన విషయాలు) కోణం కూడా ఉంది. భూకంపాలు, వరదలు, సునామీలు, వీటి ప్రభావం గురించి పూర్తిగా అర్థంచేసుకోవడానికి జాగ్రఫీ విషయ పరిజ్ఞానం కొంతవరకు అవసరం. అలాగే ఈ విపత్తుల వల్ల ఏ తీరప్రాంతాల్లో నష్టం జరుగుతున్నది, ఏయే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటి ప్రభావానికి గురి అవుతున్నాయి వంటివాటి కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటుభారతదేశ నైసర్గిక స్వరూపంపై అవగాహన అవసరం.
నదులు, వాటి జన్మస్థలం, ఇవి ప్రవహించే రాష్ట్రాలు, వీటి వరదల వల్ల ఏ ప్రాంతాలు ముంపునకు గురి అవుతున్నాయో తెలుసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్‌, భారతదేశ పటాలు పరిశీలిస్తూ చదివితే ఉపయోగం.
ఉదాహరణ: అస్సాంలో ఎక్కువగా వరదలు ఏ నది వల్ల కలుగుతాయి? 
ఎ) గోమతి బి) గంగా సి) బ్రహ్మపుత్ర డి) యమున
జవాబు:సి
గడిచిన ఒకటి రెండు సంవత్సరాల్లో దేశంలో, ప్రపంచ వాప్తంగా ప్రముఖంగా సంభవించిన వరదలు, భూకంపాలు, సునామీలు వంటి వాటిని కరెంట్‌ అఫైర్స్‌ కోణంలో చదవాలి. ముఖ్యంగా ఏయే ప్రాంతాల్లో, ఏయే దేశాల్లో ఇవి సంభవించాయి, వీటి తేదీలు, తుపానులకు పెట్టిన పేర్లు, కలిగిన నష్టం, ప్రకృతి విపత్తులపై ప్రముఖులు రచించిన పుస్తకాలు వంటివి కరెంట్‌ అఫైర్స్‌ అంశాలుగా పరిగణిస్తూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి.
ఉదాహరణకు:ఇటీవల ప్రచురితమైన 'నేషనల్‌ హజార్డ్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌' పుస్తక రచయిత ఎవరు? (సి) 
ఎ) రంజన్‌బసు బి) కళ్యాణ్‌ చక్రవర్తి సి) సత్యేష్‌చక్రవర్తి డి) చందన్‌ సురభిదాస్‌
జవాబు: సి
పదాల అర్థాలపై ప్రశ్నలు
సునామి, డిజాస్టర్‌, మాన్‌సూన్‌ వంటి పదాలకు అర్థాలు, ఇవి ఏ భాషనుంచి వచ్చాయి అనే అంశాలను కూడా చదవాలి. గత పరీక్షల్లో వీటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా సునామీ, భూకంపం, వరదలకు సంబంధించిన సమాచారం అన్ని కోణాల్లో సేకరించి ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రశ్నల్లో ఎక్కువ భాగం వీటినుంచే వస్తున్నాయని గమనించాలి.